పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. బైక్‌ని తప్పించబోయి.. వంతెన రెయిలింగ్ను ఢీకొంది బస్సు.ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రమాదంపై సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్, బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


ప్రధానమంత్రి కార్యాలయం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరంగా ఉంది . ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అన్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం లో మరణించిన వారికి, ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు PMNRF నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.ఏపీలో బస్ ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.