Site icon NTV Telugu

టీడీపీ-జనసేన పొత్తు.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పరిషత్‌ ఎన్నికల ఫలితాలు కీలక పరిణామాలకు తెరలేపాయి.. ఇప్పటి వరకు దూరంగా ఉన్న టీడీపీ-జనసేన కలిసి ఆచంట ఎంపీపీ ప‌ద‌విని టీడీపీ కైవ‌సం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంట‌లో టీడీపీ 7 స్థానాలు, వైసీపీ 6 స్థానాలు, జ‌న‌సేన 4 స్థానాల్లో విజయం సాధించగా.. టీడీపీ, వైసీపీలు ఇద్దరిలో ఎవ‌రు ఎంపీపీ కావాలన్నా.. జ‌న‌సేన మ‌ద్ధతు అవ‌స‌రంగా మారింది. క్యాంపు రాజ‌కీయాలు షురూ కావ‌డంతో టీడీపీ, జ‌న‌సేన పార్టీలు త‌మ ఎంపీటీసీల‌ను ర‌హస్యప్రాంతాల‌కు త‌ర‌లించారు. కాగా, ఈ ఎంపీపీ ప‌ద‌వి కోసం టీడీపీ, జ‌న‌సేన పార్టీలు పొత్తును కుదుర్చుకున్నాయి. పొత్తులో భాగంగా ఆచంట ఎంపీపీ ప‌ద‌వి టీడీపీ ద‌క్కించుకోగా, వైస్ ఎంపీపీ ప‌ద‌విని జ‌న‌సేన దక్కించుకుంది.. అయితే, టీడీపీ-జనసేన దోస్తీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ..

టీడీపీ-జనసేన పార్టీ కలిసి పనిచేయడం మంచి పరిణామం అన్నారు పితాని సత్యనారాయణ.. ఆచంట నుంచే అది ప్రారంభం అయ్యిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రెండు పార్టీలు కలవాల్సిన పరిస్థితి ఉందని.. దీనిపై టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వైసీపీవారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. టీడీపీ, జనసేన ఇలా ఇతర పార్టీలకు చెందినవారు ఉంటే.. వారికి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. అయితే, దారుణంగా వ్యవహరిస్తున్న వైసీపీని గద్దెదించాలంటే.. ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలన్నారు.. అలాంటి సంకేతమే ఆచంట నుంచి మొదలైందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ఆచంటలో ఈ కలయిక ప్రారంభమైంది.. దీనిని అందరూ ఆహ్వానించాలన్నారు మాజీ మంత్రి పితాని సత్యనారయణ. ఇక, పితాని ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..

Exit mobile version