NTV Telugu Site icon

Bandi Sanjay: రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ విడుదల చేయాలి.. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ..!

Bandi Kcr

Bandi Kcr

Bandi Sanjay: రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ ను విడుదల చేయాలని, ఉద్యోగులకు పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. నమస్కారం అంటూ మొదలుపెడుతూ.. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకుంటున్న మీ ప్రభుత్వం అసలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులతో పాటు పెన్షనర్ల కుటుంబాలు ఎలా ఉన్నాయో.. ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా అని లేఖలో ప్రశ్నించారు. ఉద్యోగులకు నెలనెలా సక్రమంగా జీతాలివ్వడం లేదని.. రిటైర్డ్ ఉద్యోగులకు సైతం సకాలంలో పెన్షన్ ను ఇవ్వకపోవడం దారుణమన్నారు. గత రెండు నెలలుగా చాలా జిల్లాల్లో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేదని లేఖలో ఆరోపించారు.

Read Also: Botsa Satyanarayana: పవన్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స స్ట్రాంగ్ కౌంటర్

ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ.. మీ పాలనా పుణ్యమా అని అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదని.. రిటైర్ అయిన ఉద్యోగులకు అదే రోజున రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పిన మీ మాట ప్రకటనలకే పరిమితమైందని బండి సంజయ్ తెలిపారు. నెలల తరబడి రిటైర్డ్ ఉద్యోగులంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని.. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 460 మంది ఉద్యోగుల పెన్షన్ ఫైళ్లు ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులది ఇదే పరిస్థితి అని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్‌ను నిర్వీర్యం చేసి, వారికి వైద్య సేవలు అందకుండా చేశారని దుయ్యబట్టారు. ప్రమోషన్లు, పోస్టింగుల్లో మీ వందిమాగదులను నియమించుకుని, అర్హులకు అన్యాయం చేశారన్నారు.

Read Also: Lifestyle : అబ్బాయిలు ఇలా ఉంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారట..

ఈ నెలాఖరుతో మొదటి PRC గడువు ముగియబోతోంది. వచ్చే నెల నుండి కొత్త PRC అమల్లోకి రావాలి. కానీ ఇప్పటి వరుకు మీరు కనీసం PRC కమిషన్ ను నియమించకపోవడమంటే ఉద్యోగులను, ఉపాధ్యాయులను దగా చేయడమేనని బండి సంజయ్ అన్నారు. కొత్త పీఆర్‌సీ అసలు అవసరమే లేదని, ఉద్యోగులు, పెన్షనర్లు మీకు ఓటెయ్యరని మీరు మీ సన్నిహితులతో అన్నట్లుగా పత్రికల్లో వచ్చిన వార్తలు విస్మయానికి గురి చేస్తున్నాయని తెలిపారు. కానీ ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలోనూ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుండడం బాధాకరమన్నారు. తక్షణమే పెన్షనర్లందరికీ పెన్షన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు బండి సంజయ్ అన్నారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని.. తక్షణమే పీఆర్సీ వేసి ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్న విధంగా వేతనాలు, డీఏ పెంచాలని బీజేపీ తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని లేఖలో తెలియజేశారు.