Site icon NTV Telugu

అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్

ఏపీ రాజధాని అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. మంగళగిరిలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా దీక్షకు దిగిన పవన్‌ను అమరావతి ప్రాంత మహిళా రైతులు కలిశారు. తొలి నుంచి అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉన్న పవన్‌కు కృతజ్ఞతలు చెప్పిన వారు.. ముగింపు సభకు రావాలని ఆహ్వానించారు. తమ ఆహ్వానం పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు అమరావతి ప్రాంత మహిళా రైతులు వెల్లడించారు. అయితే తిరుపతిలో అమరావతి రైతులు పాదయాత్ర ముగింపు సభ నిర్వహించాలని తలపెట్టగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ సభ అనుమతి కోసం తాము హైకోర్టును ఆశ్రయిస్తామని రైతులు స్పష్టం చేశారు.

మరోవైపు అమరావతి రైతుల పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. వారి పాదయాత్ర 42వ రోజుకు చేరింది. ఎన్ని కష్టాలు ఎదురైనా అమరావతి రైతులు పాదయాత్రను చేస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా కృష్ణా జిల్లా గన్నవరం నుంచి మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లే మార్గం అధ్వాన్నంగా తయారైంది. ఈ నేపథ్యంలో ఈరోజు వడ్డేశ్వరంలో ఆగి పవన్ కళ్యాణ్ శ్రమదానం నిర్వహించారు. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేపట్టారు.

Exit mobile version