NTV Telugu Site icon

మంత్రి బొత్సపై పవన్ కల్యాణ్ సెటైర్లు.. ఆయన పరిస్థితికి ప్రగాఢ సానుభూతి..!

మంత్రి బొత్స సత్యనారాయణపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్… విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ విజయనగరం జిల్లా జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తికర కామెంట్లు చేశారు.. వైసీపీలో బొత్స పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్న ఆయన.. ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశాన్ని చిటికెలో కొల్పోయిన వ్యక్తి బొత్స.. అలాంటి గొప్ప నేత బొత్సకు కనీసం హోం మంత్రో.. పరిశ్రమల మంత్రో.. ఆర్థిక మంత్రో అవుతారు అనుకున్నా… కానీ, చివరికి మున్సిపల్‌ శాఖ మంత్రి పదవి ఇచ్చి.. ఆ తర్వాత సహాయ మంత్రిగా మార్చేశారు అని ఎద్దేవా చేశారు.

వైసీపీలో ఏ మంత్రికి.. వారి వారి శాఖల గురించి మాట్లాడే హక్కు లేదు.. బొత్స పరిస్థితి కూడా అంతే.. అందుకే ఆయనను సహాయ మంత్రి అన్నానని తెలిపారు పవన్‌ కల్యాణ్.. సుమారు 28 నుంచి 30 శాతం జనాభా ఉన్న బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన బొత్స పరిస్థితి ఇవాళ చాలా దయనీయంగా ఉందని.. వైసీపీలో బొత్స మరింత ఎదగాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్‌ చేశారు. ఇక, బొత్స ప్రస్తుత పరిస్థితికి చింతిస్తూ.. ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు జనసేనాని.. మరోవైపు.. బొత్స గతంలో మాదిరిగా బెల్ట్‌ షాపుల ద్వారా కాకుండా.. ప్రభుత్వం ద్వారానే మద్యపాన నిషేధం అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు పవన్‌ కల్యాణ్.