ఒకప్పుడు కరోనా వైరస్.. తర్వాత డెల్టా… ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్. చిన్నవైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ ప్రభావం.. ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని WHO ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తితో.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. దీని తీవ్రత తక్కువగానే ఉంది. అయితే ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉండటంతో.. దీనివల్ల మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని WHO హెచ్చరించింది. వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఒమిక్రాన్ వైరస్ వల్ల.. మరింత ప్రమాదకర వేరియంట్లు రూపాంతరం చెందే అవకాశం ఎక్కువగా ఉంది. వైరస్.. మానవ శరీరంలోకి ప్రవేశించాక.. పరిస్థితులకు తగ్గట్లు రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఎక్కువ మందికి వ్యాపించడం వల్ల.. ఎక్కువ మార్పులు జరిగి.. ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయంలో నిరంతరం అప్రమత్తత అవసరం.
ఒమిక్రాన్ ప్రభావం.. ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని WHO నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ తొలిసారి బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి, మరణాల రేటు తక్కువగానే ఉంది. అయితే దక్షిణాఫ్రికాలో లాగే అన్నిచోట్ల ఇదే పరిస్థితి ఉంటుందని భావించలేమంటోంది WHO. ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం చూపించొచ్చు. పరీక్షలు చేయడం, రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. భారత్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరొచ్చని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. పండుగలు, ఎన్నికల వల్ల జనం గుమిగూడడం వల్ల ఈ ప్రమాదం మరింతగా పెరగగలదని అంటున్నారు.