ఇటీవల ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. కొవ్వూరులో ప్రసన్న కూమార్ రెడ్డి అంటే ఏంటో అందరికి తెలుసునని, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం అంటే చాలా గౌరవం ఉందని ఆయన అన్నారు. అనవసరపు వ్యాఖ్యలతో గౌరవాన్ని దిగజార్చుకోవద్దని, వంద అడుగులు పైనుంచి రోప్ కట్టుకొని కిందకు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో తెలుస్తుందని ఆయన మండిపడ్డారు.
మీడియా ముందు మాట్లాడితే హీరో అయిపోరని, బలిసి కొట్టుకుంటోంది మీరేనని, ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమా వాళ్ళని అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదని, సినిమా నిర్మాణం ఎంత కష్టమో వచ్చి ప్రత్యక్షంగా చూడండని ఆయన సవాల్ విసిరారు. నా సినిమా నిర్మాణం సమయంలో ప్రసన్నకుమార్ ను ఆహ్వానిస్తాని ఆయన వెల్లడించారు.