కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా దేశంలోని రాష్ట్రాల్లో పాకుతోంది. ఇప్పటికే దేశంలోని 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఆయా జిల్లాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకున్నాడు. అయితే ఆ వ్యక్తికి దక్షిణాఫ్రికాలో నిర్వహించిన టెస్టుల్లో నెగటివ్ రాగా, ఏపీలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.
దీంతో అతడి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపించగా ఒమిక్రాన్ వేరియంట్‌గా నిర్థారణైంది. అలాగే ఇటీవల యూకే నుంచి బెంగళూరు మీదుగా అనంతపురంకు వచ్చిన వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌గా నిర్థాణైంది. దీంతో వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒమిక్రాన్ సోకిన ఇద్దరిలోనూ తీవ్రమైన లక్షణాలు లేవని వైద్యాధికారులు వెల్లడించారు.