ఏపీలో విచిత్రమయిన రాజకీయం ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రధాన కులాలకు పోటీగా మిగతా కులాల నేతలు ఏకీకరణకు ప్రయత్నిస్తున్నారు. నాన్ రెడ్డి, నాన్ కమ్మ నేతల ఏకీకరణ ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో కాపునేతలు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఆలోచనకు తెర తీస్తే, దానికి మద్దతు పలికారు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. అయితే ఇవి వైసీపీకి లబ్ధిచేయడానికి చేస్తున్న ప్రయత్నాలుగా మరో కాపు నేత చేగొండి హరిరామజోగయ్య ఆరోపించారు. కాపులకు రాజ్యాధికారం కావాలన్న కోరికను సవరించుకున్న ఆ సామాజికవర్గం… కమ్మ, రెడ్డియేతర కులాల కూటమి కోసం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
ఈ ప్రయత్నాలకు కాపు రిజర్వేషన్ ఉద్యమనేత ముద్రగడ మద్దతు పలికారు. పల్లకీ మోసే బోయల్లా… అవసరం తీరాక విసిరికొట్టే జాతుల్లా ఇంకా ఉండాలా? కరివేపాకులా తీసేసే ఆ రెండుకులాలకు ధీటుగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందరం కలిస్తే ఆ రెండు కులాలను అధికారం నుంచి దూరం చేయలేమా? అంటూ ఆయన ఓ బహిరంగలేఖ రాయడం కలకలం రేపింది. తమ సామాజికవర్గం ఒక్కటే పోరాడితే.. అధికారంలోకి రావడం కష్టమని గుర్తించిన కాపులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను తమతో పాటు కలుపుకుని కొత్త కూటమి కట్టాలనే సరికొత్త వ్యూహానికి తెరతీశారు. అందుకోసం ఇప్పటికే ప్రాథమిక సమావేశాలు పెట్టిన ఆ వర్గం.. తదుపరి కార్యాచరణకు కసరత్తు చేస్తున్నారు.
కూటమి ఏర్పాటు చేయాలన్న ఆలోచనలకు ముద్రగడ కూడా అండగా నిలిచారు. ఇప్పటికే గోదావరి జిల్లాల బీసీ నేతలతో భేటీ అయిన ముద్రగడ… హైదరాబాద్ లో సమావేశమైన కాపు నేతల అజెండాను బలపరిచారు. ఈ కొత్త కాన్సెప్ట్‌తో.. కొంత మంది నేతలను సంప్రదిస్తున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ తో కూడా వీరితో మాట్లాడినట్టు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత నిస్తేజమైన కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా.. కాపు నేతల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో పలుకుబడి ఉన్న వారితోపాటు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న రఘువీరారెడ్డి లాంటి వాళ్లతో కూడా ఈ టీం మాట్లాడుతోందని తెలుస్తోంది.
మరోవైపు ఈ ప్రయత్నాలను కాపు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య తప్పుపడుతున్నారు. కులాలకు అతీతంగా జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఉండగా.. ఈ కొత్త కూటమి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇదంతా కాపుల ఓట్లు చీల్చి వైసీపీకి మేలు చేయడానికి చేస్తున్న కుట్రగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో సమావేశమైన కాపు నేతలకు పార్టీ పెట్టి నడిపేంత శక్తి లేదని విమర్శించారు.
అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీల మద్దతుతో పవన్ కల్యాణ్ ను.. బలపరిస్తే కాపులకు రాజ్యాధికారం సాధ్యం అవుతుందని ఓ ప్రకటనలో తెలిపారు హరిరామజోగయ్య. ఈ కొత్త కూటమి ప్రయత్నాలను ఏపీలోని అన్ని పార్టీలు గమనిస్తున్నాయి. ఎంత వరకు ఈ కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందనే లెక్కలు వేస్తున్నాయి. అయితే అందులో చేరే నేతలు ఎవరు? ఏ స్థాయి వారు అనేది తేలితే తప్ప.. దానికి ఉనికి ఉంటుందా? పుట్టక ముందే పోతుందా? అనేది అర్ధం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.