కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు తీవ్రతరం చేస్తూ.. నైట్ కర్ఫ్యూను విధించారు. మరికొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్‌డౌన్ కూడా విధిస్తున్నారు. అయితే ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి ఈ నెల 31 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవల సిబ్బందికి మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
వీరితో పాటు దూరప్రాంతాలు ప్రయాణించే వారికి, సరకు రవాణా వాహనాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో 200, హాళ్లలో 100 మందికి మాత్రమే అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దుకాణాలు, వాణిజ్య సంస్థలు కోవిడ్ ఆంక్షలు పాటించాలని, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.