వీఐపీలను నిలువునా ముంచేసిన శిల్ప చౌదరి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. శిల్ప ఆమె భర్త శ్రీనివాస్ పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నటుడు సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని, రోహిణి రెడ్డి. 2 కోట్ల 90 లక్షలు తీసుకొని మోసం చేశారని ప్రియదర్శిని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు కేసుల్లో నిందితులు శిల్ప, శ్రీనివాస్ లు ఇద్దరిపై కోర్ట్ లో పీటీ వారెంట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు.
మరోవైపు శిల్పా దంపతుల కస్టడీ , బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. శిల్పా భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు బెయిల్ మంజూరు చేసింది రాజేంద్ర నగర్ కోర్ట్. శిల్పా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది న్యాయస్థానం. కస్టడీపై తీర్పు వెల్లడించింది.శిల్పాచౌదరి కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతిచ్చింది. ఐదురోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు.. శిల్పాచౌదరికి బెయిల్‌ను నిరాకరించింది. కిట్టి పార్టీల సందర్భంగా తమకు శిల్ప పరిచయం అయిందని పోలీసులకు మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని తెలిపారు.
కోట్లలో జనాన్ని ముంచేసిన శిల్పా చౌదరి వ్యవహారంలో ఇప్పటికే కీలక విషయాలు తెరపైకి వచ్చాయి. కిట్టి పార్టీ లో పాల్గొన్న చాలా మంది మహిళల నుంచి శిల్పా చౌదరి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని విలాసవంతమయిన భవనం కొనుగోలు చేశారు. డబ్బుల వసూలు కోసమే ప్రతి వీకెండ్లో శిల్ప కిట్టీ పార్టీ ఏర్పాటు చేసేదని పోలీసులకు బాధితులు తెలిపారు. ఆమె చేతిలో అడ్డంగా మోసపోయిన వారు పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే శిల్పపై మూడు కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిర్యాదులతో పోలీసులు మరోసారి శిల్పా చౌదరిని తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆమె వ్యవహారంలో మరిన్ని ఫిర్యాదులు రావచ్చంటున్నారు.