కొత్త పీసీసీ చీఫ్, కొత్త కమిటీలను నియమించిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అలా అనీ మొత్తం కార్యక్రమాలకు దూరంగా ఉండడం లేదు.. ఆయన నియోజకవర్గం, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ, పార్టీ సమావేశాలకు, సభలకు దూరంగా ఉంటున్నారు. ఇక, అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ నాయకత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న కోమటిరెడ్డి.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అసలు తాను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో చెప్పుకొచ్చారు.
ఇక, నాకు షో రాజకీయాలు తెలియవు అని వ్యాఖ్యానించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రెండేళ్లలో ఎన్నికలు వస్తుంటే ఇలాగేనా పార్టీ సన్నద్ధత అంటూ ఫైర్ అయిన ఆయన.. అందుకే పొలిటికల్ అఫైర్స్ మీటింగ్‌కి వెళ్లడంలేదని స్పష్టం చేశారు. ఇక, సీనియర్లను సంప్రదించకుండా అధికార ప్రతినిధులను నియమిస్తారా? అని ప్రశ్నించారు కోమటిరెడ్డి.. వచ్చేవారం రాహుల్ గాంధీ, ప్రియాంకతో ఈ విషయాలను చర్చించనున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలి.. అప్పుడే గెలుస్తుందన్నారు.. ఇక, హుజురాబాద్ ఖాళీ అయ్యి నాలుగున్నర నెలలు అయ్యిందని.. కొత్త పీసీసీ వచ్చి మూడున్నర నెలలు అయినా.. ప్రధాన ప్రతిపక్షం ఎందుకు రివ్యూ చేయట్లేదు అని ప్రశ్నించారు కోటమిరెడ్డి. పీసీసీ నేతలు హుజురాబాద్ ఎందుకు వెళ్లరు? అని నిలదీశారు. పార్టీలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… హుజురాబాద్‌లో మూడు ఎన్నికల్లో 50, 60 వేల ఓట్లు వచ్చాయని.. అందరం కలిసి పనిచేస్తే మరో 50 వేల ఓట్లు రావా? సీనియర్లను ఇంఛార్జ్‌లుగా పెట్టి వారానికి ఒక్కసారి సమావేశాలు పెడితే గెలవదా? అని ప్రశ్నించారు. జీరోగా ఉన్న దుబ్బాకలో 23 వేల ఓట్లు తెచ్చుకున్నామని గుర్తుచేసిన కోమటిరెడ్డి.. హుజురాబాద్‌లో ఫైట్ జరుగుతుంటే.. దానిని కాంగ్రెస్ వదిలేస్తే.. అర్థం ఏంటి..? అని ప్రశ్నించారు. హుజురాబాద్ యుద్ధానికి ముందే చేతులు ఎత్తేస్తామా? అని ప్రశ్నించిన ఆయన అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని తవెల్లడించారు.