వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుంటే తమ పరువు పోతుందని భావించిన తల్లి ఏకంగా తన కుమార్తెను కడతేర్చింది. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మీ తెలిపిన వివరాల మేరకు… పర్వతగిరికి చెందిన ఉబ్బని సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తెకు వివాహం జరిపించిన అనంతరం ఆమె భర్త చనిపోయాడు. దీంతో సమ్మక్క కూరగాయలు విక్రయిస్తూ బతుకుబండి నెట్టుకువస్తోంది.
Read Also: తూ.గో. జిల్లాలో యువకుడి దారుణహత్య… శవాన్ని ముక్కలు చేసి…
ఈ నేపథ్యంలో పదోతరగతి చదువుతున్న రెండో కుమార్తె అంజలి (17) పర్వతగిరిలోనే నివసిస్తున్న రాయపురం ప్రశాంత్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి సమ్మక్క చాలా సార్లు కూతురిని మందలించింది. అయితే కుమార్తె తీరు మారకపోవడవంతో కర్కశంగా ప్రవర్తించింది. తన కూతురు పెళ్లి చేసుకుంటే పరువుపోతుందని భావించిన సమ్మక్క.. తన తల్లి యాకమ్మతో కలిసి గత నెల 19న అర్థరాత్రి అంజలి నిద్రలో ఉండగా ముఖంపై దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేసింది. అనుమానాస్పద మరణం కింద పోలీసులు కేసును నమోదు చేశారు. అయితే ఈ కేసు విషయంలో తల్లి, అమ్మమ్మను విచారించగా కులాంతర వివాహం చేసుకుంటుందనే భయంతోనే హత్య చేశామని ఒప్పుకున్నారు. కాగా తెలంగాణలో గతంలో మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య పరువు హత్యగా అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.