NTV Telugu Site icon

కేంద్ర విధానాలతో విద్యుత్ సంస్థలకు నష్టాలు

కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. విద్యుత్ సంస్థలు నష్టాల నుంచి బయటపడాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. విద్యుత్ ఛార్జీల పెంపు స్వల్పంగానే ఉంటుంది. విద్యుత్ ఛార్జీల పెంపును ప్రజలు సమర్దిస్తున్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

గడిచిన ఏడు సంవత్సరాల్లో ఒక్క పైసా పెంచలేదు. తెలంగాణ పక్క రాష్టాల్లో అక్కడి ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచాయి. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ కార్మికులు సమ్మె చేశారు. సింగరేణి సమ్మెకు ఉద్యమ పార్టీగా మద్దతు ఇచ్చాము. కేంద్ర మంత్రి సింగరేణి సమ్మె పై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేశారు. సింగరేణిని ఆదాని, అంబానిలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడి తెస్తుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలు రాష్ట్రం తీర్చిన తరువాత ప్రైవేటుకు అప్పగిస్తారు.కేంద్రం తీసుకువచ్చే విద్యుత్ సవరణ బిల్లును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.విద్యుత్ సవరణ బిల్లు వల్ల అన్ని రంగాలకు ఇబ్బందులు తప్పవన్నారు ఎన్టీవీతో జగదీష్ రెడ్డి.