Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫార్ డ్యాం, గైడ్ బండ్ తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో వివరాలను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు చాలా వైవిధ్య భరితమైనదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గైడ్ బండ్ కుంగిన మాట వాస్తవమేనని.. ఎవరి వైఫల్యం వల్ల తప్ప జరిగిందనేది నిపుణుల కమిటీ నిర్ధారిస్తుందన్నారు. గైడ్ బండ్ కుంగడం ప్రమాదభరితమైనది కాదని.. అయినప్పటికీ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు.
Also Read: Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 19న ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
స్పిల్ వే పై ఒత్తిడి తగ్గించేందుకు గైడ్ బండ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పోలవరంలో జరుగుతున్న విషయాలను రహస్యంగా దాచవలసిన అవసరం లేదని.. బయట నుంచి ప్రజలను తీసుకువచ్చి భజన చేయించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని మంత్రి వివరించారు. పోలవరం సందర్శించేందుకు ఎవరైనా అనుమతి తీసుకుని రావచ్చన్నారు మంత్రి అంబటి రాంబాబు. ప్రాజెక్ట్ రాజకీయ వేదిక కాదు..పవిత్రమైన ప్రాంతమని.. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.