మంచు మనోజ్ అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ఆశాజనకమైన ప్రణాళికలకు తాను సపోర్ట్ చేస్తున్నాను అని మనోజ్ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో మంచు మనోజ్ తాను ముఖ్యమంత్రితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. “దూరదృష్టి గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిని కలవడం గౌరవంగా భావిస్తున్నాను. రాష్ట్రం కోసం ఆయన చేస్తున్న కొన్ని గొప్ప ఆలోచనల గురించి చర్చించాము. సమీప భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న అద్భుతమైన ప్రణాళికలను విన్నాను. అవి అద్భుతంగా, ఆశాజనకంగా ఉన్నాయి. జగన్ సార్ మీ విజన్ సాధించడానికి దేవుడు మీకు బలం, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. మీ పరిపాలనకు శుభాకాంక్షలు” అని మనోజ్ ట్వీట్ చేశాడు.
It was an honor and privilege to meet the visionary CM Of Andhra Pradesh Shri @ysjagan garu.
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 6, 2021
Heard his plans for the near future which are quite promising.
Sir, may God bless you with abundance strength & good health to accomplish your vision.
Best wishes for ur Governance. pic.twitter.com/Mv0hMc65AC
సీఎం నుంచి సినీ పెద్దలకు ఆహ్వానం ఏమైంది ?
కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం నుంచి సినిమా పెద్దలకు ఆహ్వానం వచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవితో పాటు సినిమా పెద్దలంతా కలిసి సీఎంతో భేటీ అయ్యి టాలీవుడ్ కు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాల్సి ఉంది. అయితే ఈ మీటింగ్ ఈ రోజు రేపు అంటూ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఒకసారి సీఎం సెలవులో ఉన్నారని, మరోసారి సమావేశం వాయిదా పడిందనే వార్తలను వింటూనే ఉన్నాము. ఇప్పటికే విడుదల కావలసిన సినిమాలు ఈ భేటీ విషయంలో చాలా ఆశలే పెట్టుకున్నారు.
“వకీల్ సాబ్” వైరం
ఆంధ్రప్రదేశ్ లో “వకీల్ సాబ్” సమయంలో ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచడంతో ప్రభుత్వం వాటిని నియంత్రిస్తూ జీవో జారీ చేసింది. సీఎం పవన్ పై పొలిటికల్ రివేంజ్ తీర్చుకుంటున్నారు అంటూ అప్పట్లో విమర్శలు కూడా విన్పించాయి. కానీ జగన్ ఈ విషయాలేమీ పట్టించుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జీవో అలాగే కొనసాగుతోంది. దీంతో ఈ టికెట్ రేట్లతో థియేటర్లు నడపలేమని థియేటర్ యాజమాన్యం మొత్తుకుంటోంది. పైగా కరోనా పుణ్యమాని 50 శాతం అక్యుపెన్సీతోనే థియేటర్లను నడపడానికి ఆంధ్రాలో అనుమతి ఉంది. వీటితో పాటు మరిన్ని సమస్యలు సీఎంతో సినీ ప్రముఖుల భేటీలో పరిష్కారం అవుతాయని అంతా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచు హీరో మనోజ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరుగుతోంది ?
ఆంధ్రా ముఖ్యమంత్రితో సమావేశానికి మంచు మనోజ్ కు ఎలా అపాయింట్మెంట్ దొరికింది ? చాలా రోజుల నుంచి అనుకుంటున్నా సినీ పెద్దలకు మాత్రం సీఎంతో సమావేశానికి అపాయింట్మెంట్ ఎందుకు దొరకడం లేదు ? అనే విషయాలు మాత్రం ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మరోవైపు “మా” ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో ఇప్పట్లో టాలీవుడ్ పెద్దలు అసలు సీఎంని కలుస్తారా ? అనే అనుమానం రాక మానదు. ఇదిలా ఉండగా మంచు మనోజ్ అకస్మాత్తుగా ఏపీ సీఎంను కలవడం వెనుక కారణమేంటా ? అని టాలీవుడ్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.