Site icon NTV Telugu

‘మా’ ఎన్నికలు ఖాయం! క్రమశిక్షణ సంఘానికి నిర్ణయాధికారం!!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకూ జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో ‘మా’ ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో దాదాపు 160 మంది సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం. ఎన్నికలు అనివార్యం అని చెప్పిన సభ్యులు, దానిని నిర్వహించే తేదీపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరపాలని ప్రకాశ్ రాజ్ బృందం ఒత్తిడి చేయగా, కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ లో జరిపితే మంచిదని మరికొందరు సూచించారట.

ఒకసారి కొన్న ‘మా’ బిల్డింగ్ ను ఎందుకు తిరిగి అమ్మేశారు? భారీ మొత్తానికి కొన్న ఆ భవంతిని తక్కువ రేటుకు ఎందుకు అమ్మారు? అనే అంశాలపై అందరూ మౌనం వహించడంపై మోహన్ బాబు ప్రశ్నించినట్టు తెలిసింది. రాజశేఖర్ ‘మా’ ఉపాధ్యక్ష పదవి నుండీ వైదొలగడంపై ఆవేదన వ్యక్తం చేసిన మోహన్ బాబు తిరిగి ఆయన ‘మా’లో యాక్టివ్ అయ్యేలా చూడమని, జనరల్ సెక్రటరీ జీవితకు చెప్పారట. ఒకవేళ ఎన్నికలు జరపడానికి సెప్టెంబర్ 12 అనుకూలంగా లేకపోతే కనీసం 19వ తేదీ జరపమని ప్రకాశ్ రాజ్ కోరారట. ఎన్నికలు వీలైనంత త్వరగా జరపాలన్నదే తన అభిమతం కూడా అని తెలిపిన ‘మా’ అధ్యక్షుడు నరేశ్, క్రమశిక్షణ సంఘం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని తెలిపారట. సభ్యులందరి సలహాలూ, సూచనలు విన్న మురళీ మోహన్, కృష్ణంరాజు ఓ వారంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం. సో… ఇప్పుడు ‘మా’ ఎన్నికల బాల్ క్రమశిక్షణ సంఘం కోర్టులో ఉంది!!

Exit mobile version