ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని కేసీఆర్ ఎండగట్టారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. 700 మందిని పొట్టనపెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రాన్ని ఒప్పించే దమ్ములేక తెలంగాణ బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి సిపాయిలా పోరాడి కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించాలంటూ సవాల్ విసిరారు. బీజేపీ హయాంలో అన్నపురాశులు ఒకవైపు.. ఆకలి కేకలు ఇంకోవైపుగా పరిస్థితి ఉందని ఆయన మండిపడ్డారు.
సమస్యలు చెప్పుకునేందుకు మంత్రుల బృందంతో ఢిల్లీకి వెళితే కేంద్రం స్పందించలేదని, బీజేపీ మోసకారి ప్రభుత్వం అంటూ విమర్శించారు. బీజేపీ పాలన కంటే కోటిరెట్లు అన్ని రంగాల్లో మంచిపాలన అందిస్తున్నామని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, పీయూష్ గోయల్‌లు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. రైతుల మెడపై కత్తిపెట్టి ప్రతీ బోర్ దగ్గర మీటర్ పెట్టాలని కేంద్రం చెబుతోందన్నారు. కరెంట్ మీద పెత్తనం అంతా కేంద్రం తీసుకుంటుందట.. విద్యుత్ సంస్కరణల పేరుతో మా మెడ మీద కత్తి పెట్టుడేంది.? అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.