బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు కమలనాథులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తాజా పరిణామాలు, జేడీయూతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు ఆదివారమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీష్ కూడా చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే బీహార్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితుల్ని బీజేపీ నాయకత్వం అనుక్షణం పర్యవేక్షిస్తోందని చెప్పుకొచ్చారు. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. రాజకీయాల్లో ఎప్పటికీ తలుపులు మూసి ఉండవని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో చేరాలనుకునేవారికి ద్వారాలు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. బీజేపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని గిరిరాజ్‌సింగ్ తెలిపారు.
మరోవైపు నితీష్ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో ఆ పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మద్దతు తమకు ఉందని ఆర్జేడీ చెబుతోంది. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి సర్కార్‌ను ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
Swami Paripoornananda: అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం నుంచి పోటీ.. స్వామి పరిపూర్ణానంద ప్రకటన
బీహార్‌లో ప్రస్తుతం ఇలా..
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. కనీస మెజార్టీకి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ప్రస్తుతం ఆర్జేడీకి 79, బీజేపీకి 78కి, జేడీయూకి 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16, హెచ్‌ఏఎం(ఎస్)కు నలుగురు, ఎంఐఎంకు ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాలు ఆర్జేడీతో కలిసే ఉన్నాయి. ఈ మూడు పార్టీల బలం 114 మంది ఉన్నారు. మెజార్టీకి మరో 8 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. జేడీయూ-బీజేపీ చేతులు కలిపితే మాత్రం 123 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాయి. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ తమకే ఉందని ఆర్జేడీ అంటుంది. బీహార్‌లో చోటుచేసుకున్న ఈ సంక్షోభం ఎలా ముగుస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.