Site icon NTV Telugu

Delhi Liquor Scam: ఈడీ ముందు ఎమ్మెల్సీ కవిత.. పిడికిలి బిగించి అభివాదం

Kavitha Ed Office

Kavitha Ed Office

లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈడీ ఆఫీసు చేరుకున్న కవిత… అందరికీ అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. ఈడీ ఆఫీస్ గేటు దగ్గర అభిమానులకు.. పిడికిలి బిగించి అభివాదం చేశారు. కవితకు మద్దతుగా ఈడీ ఆఫీసు గేట్ వరకూ వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు వచ్చారు. ఈడీ ఆఫీస్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కవిత వెంట ఆమె భర్త అనిల్, లాయర్లు సైతం ఉన్నారు. అయితే, వాళ్లను ఆఫీస్ గేటు దగ్గరే ఆపేశారు పోలీసులు.కేవలం కవితను మాత్రమే అనుమతించారు.
Also Read: Kiran Kumar Reddy: కమలం గూటికి కిరణ్ కుమార్ రెడ్డి

ఇదే కేసులో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. కవితకు బినామీగా చెబుతున్న పిళ్లై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సిసోడియాను శుక్రవారం కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో వారిద్దరితో వేర్వేరుగా, కలిపి కూడా కవితను ప్రశ్నించే అవకాశముంది. నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. కవిత పలుసార్లు ఫోన్లు మార్చారని, ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిపైనా ప్రశ్నించే అవకాశం ఉంది. సౌత్ గ్రూప్‌కు సంబంధించిన లావాదేవీలపై కవితను ఈడీ ప్రశ్నించనుందని సమాచారం. సౌత్ గ్రూప్‌లో కవితకు 33 శాతం వాటాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి. రామచంద్రన్ పిళ్లై సౌత్ గ్రూప్‌తో కవితకు బినామీగా ఉన్నారని, కవిత ప్రతినిధిగా ఆయన వ్యవహరించినట్లు ఈడీ పేర్కొంది.

Also Read: Asaduddin Owaisi: కేసీఆర్‌ కుటుంబాన్ని వేధించడంలో మోదీ బిజీ

మరోవైపు విచారణకు సహకరించపోతే కవితను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 12 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. విచారణకు సహకరించడం లేదనే కారణంతోనే ఈడీ అరెస్టు చేసింది. తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది. ఈ క్రమంలో కవితను కూడా అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీలో ఉత్కంఠ నెలకొంది. మార్చి 9 వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే, ముందస్తు కార్యక్రమాలు ఉండడంతో మార్చి 11న విచారణకు హాజరవుతానని కవిత సమాచారం అందించారు. దీంతో ఈరోజు విచారణ తేదీని ఈడీ అధికారులు ఖరారు చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ శుక్రవారం ఢిల్లీలో తన నిరాహారదీక్షను చేశారు.

Exit mobile version