దేశవ్యాప్తంగా కొన్ని రోడ్లు బాగానే ఉన్నా.. మరికొన్ని రోడ్లు మాత్రం అధ్వానంగా తయారయ్యాయి.. ఇక, ఈ మధ్య కురిసిన వర్షాలకు ఉన్న రోడ్లు కొన్ని కొట్టుకుపోతే.. మిగిలిన రోడ్లు దారుణంగా తయారయ్యాయి.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు అత్యంత దీన స్థితిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టీ రోడ్లే దర్శనమిస్తుంటాయి. ఉన్న రోడ్లలో కూడా చాలా వరకు అన్నీ అతుకులు, గతుకులతోనే నిండిపోయాయి. అయితే ఓ యువతి తమ గ్రామంలో అధ్వానంగా ఉన్న రోడ్ల సమస్యకు పరిష్కారం చూపేందుకు వినూత్న తరహాలో ఆలోచన చేసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక చెందిన 26 ఏళ్ల బిందు అనే యువతి.. దావణ్‌గెరె జిల్లాలోని హెచ్ రాంపురాలో టీచర్‌గా పనిచేస్తోంది. తమ రోడ్ల పరిస్థితిని సీఎంకు వినూత్న తరహాలో తెలియ జేస్తూ వార్తల్లో నిలిచింది.
ఇంతకీ బిందు ఏం చేసిందంటే.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం బసవరాజ్ బొమ్మెకు లేఖ రాసింది.. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు.. రోడ్ల పరిస్థితి.. దాంతో తాము పడుతున్న ఇబ్బందులు సీఎంకు ఏకరువు పెట్టింది.. వీలైనంత తొందరగా వాటిని పునురద్దరించాలని కోరింది. రోడ్లు బాగోలేక.. తమ ఊరి పిల్లలకు వివాహం కూడా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆ యువతి.. అలాగే రోడ్ల మరమ్మత్తులు చేపట్టేవరకు వివాహం చేసుకోనని స్పష్టం చేసింది. గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ లేదు. గ్రామం ఎంతో వెనుకబడి ఉంది. మాలో చాలా మందికి వివాహ సంబంధాలు అందడం లేదు.. ఇక్కడి పిల్లలు చదుకోవడానికి వెళ్లడం కూడా కుదరడంలేదని.. రోడ్డు బాగాలేని కారణంగా బయటి గ్రామాల వాళ్లు హెచ్ రాంపూర్‌లోని వారితో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడడం లేదని.. మా ఊరికి బస్సు లేదు. అంతేకాదు గతుకులు, మట్టిరోడ్డు.. ఈ రోడ్డులో ప్రయాణిస్తే వెన్నుముక విరిగిపోవడం ఖాయం. హెడ్నే గ్రామం నుండి మా ఊరికి వెళ్లే రెండు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు సంవత్సరాలుగా రిపేర్లు లేక అలాగే ఉంది అంటూ సీఎంకు రాసిన లేఖలో అన్ని విషయాలను ప్రస్తావించారు బిందు.. ఇక, ఈ వినూత్న లేఖపై వెంటనే స్పందించిన సీఎంవో.. గ్రామీణాభివృద్ధి,పంచాయితీరాజ్ శాఖను తక్షణమే పనులు చేపట్టాలని.. జరుగుతున్న పనుల గురించి వారికి తెలియజేయాలని ఆదేశించింది. కాగా, వినూత్న నిర్ణయంతో.. ఏకంగా పెళ్లే వద్దంటూ.. తమ ఊరికోసం యువ టీచర్ చేసిన ప్రయత్నానికి సోషల్ మీడియా ఫిదా అయిపోయి.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది.