నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంతకాలంగా తెర వెనుక ఎంత హోమ్ వర్క్ చేస్తున్నాడో ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటిస్తున్న సినిమాలను చూస్తే అర్థమైపోతోంది. ఒకటి కాదు రెండు కాదు మూడు, నాలుగు సినిమాలను కళ్యాణ్ రామ్ క్యూలో పెట్టాడని తెలుస్తోంది. అందులో ‘డెవిల్’ లాంటి పాన్ ఇండియా మూవీ ఉండటం విశేషం. ఇంతవరకూ కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై పెదవి విప్పిందే లేదు.
‘బాబు బాగా బిజీ’ ఫేమ్ నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా ‘డెవిల్’ మూవీని నిర్మించబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ టీజర్ సైతం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం అదిరిపోయింది. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదని, సమ్ థింగ్ స్పెషల్ అని దాన్ని చూస్తే అర్థమైపోతోంది.
1945లో మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటీష్ ఇండియాలోని బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ కథ ఇది. బలమైన ప్రేమతో పాటు లోతైన రహస్యాలు అతని జీవితంలో ముడిపడి ఉన్నాయని, చరిత్రలో లిఖించని సంఘటనల సమాహారమని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే పలు తెలుగు సినిమాలకు సంగీతం అందించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్థన్ రామేశ్వర్ స్వరాలు సమకూర్చుతుండగా, శ్రీకాంత్ విస్సా కథను అందించాడు. కళ్యాణ్ రామ్ గెటప్ సైతం ఎంతో ఆసక్తికరంగా ఉంది. పంచెకట్టు, మెలితిప్పిన మీసాలు, గుబురు గడ్డం, నల్లటి కోటు, ఓ చేతిలో రివాల్వర్ తో కళ్యాణ్ రామ్ ఆకట్టుకుంటున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈ ‘డెవిల్’ నందమూరి అభిమానుల గుండెల్లో చోటు సంపాదించేసుకున్నాడని చెప్పొచ్చు. మరి ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుంది? ప్రధాన తారాగణం ఎవరు? అనేది దర్శకనిర్మాతలు ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.