విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన పార్టీ డిజిటల్ ఉద్యమం చేపట్టింది. ఈ మేరకు ఈనెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేయనుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పోరాడాలని వైసీపీ, టీడీపీ ఎంపీలను ట్విట్టర్‌లో ట్యాగ్ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ విషయంపై మన ఎంపీలకు బాధ్యత గుర్తు చేయాలని పవన్ ఆకాంక్షించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పార్లమెంట్‌లో ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. తద్వారా ఉక్కు కార్మికులు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. డిజిటల్ క్యాంపెయిన్ అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తున్న ఉద్యమం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చేసే ప్రతి ట్వీట్‌లో #raise_placards_andhra_mp అనే హ్యాష్ ట్యాగ్ వాడాలని సూచించారు. లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడికి, రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు ట్యాగ్ చేయాలని సూచించారు.
అయితే పవన్ పిలుపునిచ్చిన డిజిటల్ ఉద్యమానికి ఏ మాత్రం స్పందన లభిస్తుందో వేచి చూడాలి. అయినా డిజిటల్ ఉద్యమం వచ్చే లాభమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రత్యక్ష పోరాటాలు లేదా పరస్పర సంప్రదింపులు చేయడం మానేసి డిజిటల్ ఉద్యమని చెప్పడం విచిత్రంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఎందుకు ఉపయోగించడం లేదని నిలదీస్తున్నారు. ఇటీవల మంగళగిరిలో చేసిన దీక్షతో పవన్ ఏం సాధించారని.. ఇప్పుడు డిజిటల్ ఉద్యమం ఏం సాధిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.