విశాఖలో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. డిఆర్సీ మీటింగ్ ప్రాంగణం బయట జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో పేదలు నిరసనకు దిగారు. అధికారం అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తున్నారంటూ స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ జి.వి. విశాఖ ఎంపీ ఎమ్.వి.వి సత్యనారాయణ లకు వ్యతిరకంగా బ్యానర్ల ప్రదర్శన నిర్వహించారు.
జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ఎండాడలో సర్వే నెంబర్ 92/3 లో పన్నెండున్నర ఎకరాలభూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. దొంగదారిలో 54 మందికి 32 వేల గజాలపైన భూమిని కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు.
హయగ్రీవ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, 500 కోట్లు భూమిని ప్రభుత్వం కాపాడాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ జి.విని బర్తరఫ్ చేయాలన్నారు.