మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి సహాయక చర్యలు అందించారు. వాగులు, వంకలు పొంగిపొర్లి వరద నీరు గ్రామాల్లోకి చేరింది. అంతేకాకుండా చెరువులకు గండ్లు పడడంతో కట్ట కింద ఉన్న పంటపొలాలు కొట్టుకుపోయాయి. పశువులు కూడా కొట్టుకుపోయి తీవ్ర ఆస్తినష్ట, ప్రాణ నష్టం కూడా సంభవించింది. దీంతో సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు, రేపు పర్యటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేడు కడప జిల్లాలోని రాజంపేట మండల పులపుత్తూరులో జగన్ పర్యటించారు. అక్కడి వరద బాధితులను పరామర్శించి వారిపై వరాల జల్లును కురిపించారు. ఈ సందర్భంగా వరద బాధితులు సర్వ కోల్పోయామని జగన్‌కు మొరపెట్టుకున్నారు. దీంతో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తామని, వరద ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు బ్యాంకులతో మాట్లాడి సంవత్సరం మారిటోరియం విధిస్తామని హమీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంకా జగన్ పర్యటన కొనసాగుతోంది.