ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IITH) బృందం కోవిడ్ ట్రాకర్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ ప్రొఫెసర్ ఎం విద్యాసాగర్ మాట్లాడుతూ.. 2022 జనవరి 27వ తేదీన ఒమిక్రాన్ కేసులు ఇండియాలో గరిష్టస్థాయికి చేరుకుంటాయని కోవిడ్ ట్రాకర్ ఫలితాల మేరకు ఆయన వెల్లడించారు. జనవరిలో దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఒమిక్రాన్ కేసుల నమోదయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కోవిడ్ టీకాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంపిణి చేస్తున్నాయని… కోవిడ్ టీకా తీసుకున్న వారి ఇమ్యూనిటీ దెబ్బతింటే 1.50 లక్షల కేసులు నమోదవుతాయని వెల్లడించారు.
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 30 శాతం మంది రోగనిరోధక శక్తిని నిలుపుకుంటే పాజిటివ్ ఓమిక్రాన్ కేసుల సంఖ్య గరిష్టంగా 1.30 లక్షలకు చేరుకుంటుంది. టీకాలు వేసుకున్న వారిలో 60 శాతం మంది వ్యాధి నిరోధక శక్తిని నిలుపుకుంటే కేసులు 1.10 లక్షల నుంచి 1.20 లక్షల వరకు ఉంటాయని ఆయన తెలిపారు. అయితే ఒమిక్రాన్ కేసులు ఆసుపత్రిలో చేరే రేటును బృందం అంచనా వేయలేనప్పటికీ, యువతకు కరోనా వైరస్ అంతగా హాని కలిగించనందున విద్యా సంస్థలను మూసివేయవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. విదేశాల నుండి విమాన రాకపోకలను ఆపాల్సిన అవసరం కూడా లేదని అయితే విదేశీ ప్రయాణికులను 100 శాతం స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.