దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు 11 వేలు దాటడంతో కరోనా వైరస్ మరోసారి కలవర పెడుతోంది. తాజాగా ఇవాళ కూడా రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. దేశంవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 10,753 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 27 మంది కరోనాతో మరణించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా నమోదైన 29 మరణాలతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,31,064కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.78%గా ఉంది.
కాగా, శుక్రవారం భారతదేశంలో 11,109 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది 236 రోజులలో అత్యధికం. కేసుల పెరుగుదలకు XBB.1.16 వేరియంట్ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్.
కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, వైరస్ యొక్క కొత్త XBB.1.16 వేరియంట్ ఉప్పెనకు దారితీస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. అయినప్పటికీ, భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు కోవిడ్‌కు తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బూస్టర్ డోసులను పొందాలని వారు పేర్కొన్నారు. ఇన్‌ఫ్లుఎంజా వైరస్ బారిన పడి జ్వరం సంబంధిత లక్షణాలను అభివృద్ధి చేసినప్పుడు ముందుజాగ్రత్తగా ఎక్కువ మంది.. కోవిడ్ కోసం పరీక్షించుకోవడం వల్ల ఈ కేసుల సంఖ్య పెరగవచ్చని వారు అభిప్రాయపడ్డారు. హెచ్3ఎన్2 కారణంగా ఇన్‌ఫ్లుఎంజా కేసుల సంఖ్య పెరగడానికి కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. హెచ్3ఎన్2 వైరస్ కారణంగా ముక్కు కారటం, నిరంతర దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. దీంతో బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.