భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి. తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, నిన్నటితో పోలిస్తే 40% పెరిగింది. దాదాపు ఆరు నెలల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.యాక్టివ్ కేసులు 13,509కి పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతంగా నమోదైంది.
దేశంలో కోవిడ్-19 కారణంగా 14 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,862కి పెరిగింది. మహారాష్ట్ర,ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్,కేరళ రాష్ట్రాల్లో కోవిడ్ మరణాలు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వారం కోవిడ్ కేసుల భయంకరమైన పెరుగుదలపై అనేక రాష్ట్రాలు అత్యవసర సమావేశాలను నిర్వహించాలని యోచిస్తున్నాయి. జనవరి 16న ఇన్ఫెక్షన్ల సంఖ్య 0కి పడిపోయిన ఢిల్లీలో గత 24 గంటల్లో 300 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు సమావేశానికి ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి సీనియర్ ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ డైరెక్టర్లు, ఇతర వాటాదారులు హాజరుకానున్నారు.
Also Read: Amit Shah: రాహుల్ అనర్హత వేటుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలోని ముంబై, పూణే, థానే మరియు సాంగ్లీ వంటి అనేక జిల్లాల్లో కూడా కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మంది కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో ఇంకా కోటి మంది కూడా బూస్టర్ డోస్ తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.
కాగా, కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఇటీవల కేంద్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అధిక కరోనా పరీక్షలు, జీనోమ్ సీక్వెన్సింగ్‌తో పరీక్షలను పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.