ముంబై వేదికగా నేటి నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ జరగనుంది. ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో విజయం దాకా వచ్చి డ్రాతో సరిపెట్టుకున్న భారత్.. ఈ టెస్టులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఓడిపోయే టెస్టును అద్భుతంగా పోరాడి డ్రా చేసుకోవడంతో న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టీమిండియా రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టెస్టులో బరిలోకి దిగనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు తొలి టెస్ట్ ఆడలేదు.
Read Also: కెప్టెన్ గా కోహ్లీ ముందు అరుదైన రికార్డు
అయితే టీమిండియా తుదిజట్టు ఎలా ఉండబోతున్న విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ ఎవరి స్థానంలో జట్టులోకి వస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుజారా లేదా రహానెలలో ఒకరు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా రెండో టెస్టుకు స్పిన్ పిచ్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. నిర్ణయాత్మక రెండో టెస్టులో ఫలితం రావాలనే ఉద్దేశంతో స్పిన్ పిచ్ రూపొందించినట్లు సమాచారం. సొంతగడ్డపై భారత జట్టు స్పిన్‌ను ప్రధాన అస్త్రంగా భావిస్తోన్న నేపథ్యంలో వాంఖడే పిచ్‌ను దీనికి అనుగుణంగానే తయారు చేస్తున్నామని ముంబై క్రికెట్ సంఘం వర్గాలు చెబుతున్నాయి.
