చేనుకు పురుగు పడితే మందులు చల్లుతారు. కానీ అక్కడ పురుగు పడితే పండగ చేసుకుంటారు. పురుగులను వంట చేసుకొని తింటారు. పురుగులే వారికి జీవనాధారం. ఇదిగో ఇవే తెల్లటి పురుగులు గిరి పుత్రులకు ఎంతో ఇష్టమైన ఆహారం. ఆ పురుగులను తినడమే కాకుండా.. వాటిని తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. మన్యం రొయ్యగా వీటికి పేరుంది. విశాఖ ఏజెన్సీలో పూర్వకాలం నుండి ఈ పురుగులు తినడం గిరిపుత్రుల ఆహార శైలిలో ఓ భాగం. ప్రస్తుతం ఆ పురుగులను సేకరించి అమ్ముతూ కొంతమంది గిరిజనులు జీవనోపాధి పొందుతున్నారు.ఏజెన్సీలో బొడ్డెంగు పురుగులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పూర్వకాలం నుంచి వీటిని తింటున్నారు గిరిజనులు.
ఏజెన్సీ ఎత్తైన కొండలపై ఉన్న ఈత చెట్టుల దుబ్బుల కింద పెరిగే ఈ పురుగులను.. మన్యం రొయ్యగా అభివర్ణిస్తారు. వీటిని స్థానికులు బొడ్డెంగులుగా పిలుస్తారు. సాధారణంగా ఇవి ఈత కాండం తింటూ పెరగడంతో కొవ్వు కలిగి ఉంటుంది. ఈ పురుగులను స్థానికులు వేయించుకుని తినడంతో పాటు కూరగా కూడా వండుకుంటారు. ప్రతి ఏటా సంక్రాంతికి ఈ పురుగులు లభించడంతో పండుగ చేసుకుంటారు గిరిపుత్రులు. ప్రస్తుతం వీటి రుచి మైదాన ప్రాంత వాసులను ఆకట్టుకోవడంతో పురుగులు సేకరించి అమ్ముకుంటున్నారు. ఒక్కో ఈత దుబ్బు నుండి రెండు లేక మూడు పురుగులు మాత్రమే లభిస్తున్నాయి. దీంతో రాత్రంతా పురుగుల వేట సాగించి.. ఉదయాన్నే అమ్మకానికి బయలుదేరుతారు. నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోతున్నాయంటే ఏజెన్సీలో వీటికి ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది.ఆహారంతో పాటు ఆదాయవనరుగా పురుగులు మారడం విచిత్రమే మరి.