హుజారాబాద్ ఉప ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ప్రధాన పక్షాలు దానిని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ “విశ్వసనీయత” అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీని ద్వారా ఓటర్ల మనసు గెలవాలని గులాబీ ప్లాన్. టీఆర్‌ఎస్ ప్రయోగిస్తున్న “క్రెడిబిలిటీ కార్డుకు” విరుగుడుగా బీజేపీ “ఆత్మగౌరవం” నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. నాయకులను కొనుగోలు చేయొచ్చు ..కానీ ఓటర్లను కొనలేరన్న నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని కమలదళం సిద్ధమైంది.
హుజూరాబాద్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఆర్థికమంత్రి టి.హరీష్ రావు సారధ్యం వహిస్తున్నారు. సిద్ధిపేట నియోజకవర్గం ఆరుసార్లు గెలిచానని.. దానికి కారణం ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోవటమేనని ఓటర్లకు వివరిస్తున్నారు. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెబుతున్నారు. ఏ ఒక్కటీ వదలకుండా అన్ని హామీలు అమలు చేస్తామంటున్నారు హరీష్ రావు. దగ్గరుండి పేదల టూ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తాను.. గృహ ప్రవేశానికి కూడా వస్తా.. అంటూ జనానికి దగ్గరవుతున్నారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఏడేళ్లున్నా టూ బెడ్ రూం ఇళ్లు కట్టించలేకపోయారని.. అలాగే ఒక్కటంటే ఒక్క మహిళా భవన్ నిర్మించలేదని విమర్శిస్తున్నారు. అదే సిద్దిపేటలో అలాంటివి 20 ఉన్నాయంటూ మహిళా ఓటర్లను ఆకర్షంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో నాలుగు మహిళా భవన్లను మంత్రి మంజూరు చేశారు. అలాగే ప్రతి గ్రామంలో మహిళా భవన్ నిర్మిస్తానన్నారు. హుజూరాబాద్ పట్టణంలో రోడ్ల అభివృదిద్ధికి ఆరు కోట్లు, పౌర సదుపాయాల మెరుగుదల, 13 కి.మీ సిమెంట్ కాంక్రీట్ రోడ్ల కోసం 35 కోట్ల రూపాయలను మంత్రి మంజూరు చేసారు. “హుజురాబాద్ నియోజకవర్గం నుండి గెలిచిన తర్వాత మిగిలిన ఏవైనా పనులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పూర్తి చేస్తారు” అని హరీష్ రావు అన్నారు. ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు మిగిలిపోతే గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిచిన తరువాత పూర్తి చేస్తారంటున్నారు మంత్రి హరీష్.
అంతేకాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , ఎంపీ బండి సంజయ్‌పై హరీష్ మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇప్పటి వరకు హుజూరాబాద్‌కు ఆయన ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా టీఆర్‌ఎస్‌పై స్వరం పెంచారు. టీఆర్‌ఎస్ డబ్బుతో ఇతర పార్టీల నాయకులను కొంటుందేమో కానీ ఓటర్లను మాత్రం కొనలేదని ఆత్మగౌరవ నినాదాన్ని ఓటర్ల చెంతకు తీసుకువెళుతున్నారు. ప్రజలు తనను నమ్మినందునే ఆరు సార్లు గెలిపించారని టీఆర్‌ఎస్‌కు కౌంటర్ ఇస్తున్నారు ఈటల. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను కాబట్టే మనసు విప్పి మాట్లాడగలుగుతున్నాని అన్నారు. హరీష్ రావు మంత్రి పదవి కోసం తన మనసు చంపుకుని మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ డబ్బుతో మనుషులను కొనాలనుకుంటున్నారు.. కాని ప్రజలు ఆయనకు పాఠం నేర్పుతారని ఈటల ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.
ఈటల గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారు. గులాబీ పార్టీపై స్వరం పెంచుతున్నారు. గులాబీ నేతలు ఓట్ల కొనే పనిలో పడ్డారని బీజేపీ జాతీయ నాయకుడు పి మురళీధర్ రావు ఆరోపించారు. మంత్రులందరినీ దించినా హుజూరాబాద్‌లో గెలవలేరని.. బీజేపీ గెలుపు ఖాయమంటున్నారు. అంతే కాదు ఈ గెలుపు కల్వకుంట్ల కుటుంబ పాలనకు ముగింపు పలుకుతుందంటున్నారు మురళీధరరావు.
మరోవైపు, హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘనముక్ల గ్రామంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈటెల రాజేందర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన రాజీనామా దెబ్బకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్‌కు వచ్చారని ఈటెల సెటైర్ వేశారు. దళితులు, గొల్ల కురుమలు ముఖ్యమంత్రి ఇన్నాళ్లకు గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. ఎవరినో నిలుపుకుండా స్వయంగా నిలిచి ఈ ఎన్నికల్లో గెలవాలని మంత్రి హరీష్ రావుకు సవాలు విసిరారు ఈటల. ఈ యుద్ధం కురుక్షేత్రం లాంటిదని తాము పాండవుల వైపు ఉన్నామని అన్నారు. గొర్రెలను వేటాడే తోడేళ్లు, పంటలను నాశనం చేసే మిడతలతో టీఆర్‌ఎస్ నాయకులను పోలుస్తున్నారు ఈటెల. ముందు ముందు హుజూరాబాద్ ఎన్నికల బరి యుద్ధరంగాన్ని తలపిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు!!