Site icon NTV Telugu

ప్రచార పర్వం ముగిసింది…ఇక పంపకాల పర్వమేనా!

huzurabad

huzurabad

కాలంతో పాటు ఎన్నికల ప్రచారం తీరు కూడా మారింది. ఒకప్పుడు నాయకుడు ఊళ్లోకి వస్తున్నాడంటే జనం ఆయనను చూడటానికి స్వచ్ఛందంగా వెళ్లేవారు. పనులు మానుకుని ఆయన రాకకోసం ఎదురుచూసేవారు. చెప్పింది శ్రద్ధగా వినేవారు. నాడు నాయకుల మాటల్లో ..హావ బావాలలో హూందాతనం ఉట్టిపడేది. ప్రజలతో మమేకమయ్యేవారు. ప్రత్యర్థులను విమర్శించాల్సి వస్తే సహేతుక ..సంస్కారవంతమైన భాష ఉపయోగించేవారు. కానీ నేడు ..నాయకుల తీరు చూస్తున్నాం.. నోరు తెరిస్తే బూతులు. అబద్దాలు. మర్యాద అన్నది మచ్చుకు కూడా కనిపించదు.

నాడు నాయకులంటే ప్రజలకు అభిమానం. ఎన్నికల ఖర్చు అంటూ ప్రత్యేకంగా బడ్జెట్‌ ఏమీ ఉండేది కాదు. గ్రామంలో చందాలు వసూలు చేసి ప్రచార సామాగ్రి కొనేవారు. జాజుతో గోడల మీద ఎన్నికల నినాదాలు రాసేవారు. సాయంత్రం పార్టీ జెండాలు పట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయం మారింది. రాజకీయ నేతలు మారారు… తమకు కావాల్సినట్టుగా జనాలనూ మార్చుకున్నారు.

ఎన్నికలంటే ఇప్పుడు పండగ. అది ఒక రోజు పండగో రెండు రోజుల పండగో కాదు. నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి పోలింగ్‌ రోజు వరకు సాగే ఉత్సవం. హుజూరాబాద్‌ లాంటి హైవోల్టేజీ ఎన్నికలయితే చెప్పాల్సిన పనేలేదు. తిన్నోడికి తిన్నంత ..తాగినోడికి తాగినంతా. చేతిలో అంతో ఇంతో పైకం కూడా.

నేడు ఎన్నికల ప్రచారం అంటే హైఎండ్‌ కార్లు..బలిష్టమైన బాడీ గార్డులు..మందీ మార్బలం.. టూరిస్టు హోటల్లలో బస. సాయంత్రం చల్లని బీర్లు.. కోట్ల రూపాయల ఖర్చు. కానీ నాడు ఇవేమీ లేవు. గ్రామానికి ఓ నాయకుడు ప్రచారానికి వెళ్లాలంటే అదో ప్రహసనం. ఓ డొక్కు జీపు.. దుమ్ము కొట్టుకుపోయే గతుకుల రోడ్డు. బురద.. బురద గుంతలు. ఒక ఊరు నుంచి ఒక ఊరు చేరాలంటే తాతలు గుర్తొచ్చేవారు. చాలా వరకు కాలినడకనే వెళ్లే వారు. అయినా ఉత్సాహంగా గ్రామ గ్రామం తిరిగే వారు. వేళకు భోజనం కూడా లభించేది కాదు. ఇప్పటిలా రోడ్డు సౌకర్యాలు ..హోటళ్లూ లేవు. అభిమానులు ఏర్పాటు చేస్తేనే ఆ పూటకు అన్నం.

30,40 ఏళ్ల క్రితం ఎన్నికల ఖర్చంటే కార్యకర్తల భోజనాలు. పార్టీ జెండాలు..మైకు సెట్లు ..జీపు అద్దె.. పెట్రొ మాక్స్‌ లైట్ల కిరాయి. కొంత వరకు వీటిని కూడా అభిమానులు చందాల రూపంలో సమకూర్చే వారు. ఎన్నికల ఖర్చు మొత్తం వేలల్లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క రోజు ప్రచారానికే లక్షలు ఖర్చు పెడుతున్నారు. మైక్‌ సెట్ల ప్లేస్‌ లో డీజేలు…డొక్కు జీపుల స్థానంలో ఇన్నోవా కార్లు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికల ఖర్చంటే మందు, విందు, నగదు, నట్రా, వెహికిల్స్‌ కిరాయి మనుషులు.. అంతా కలిపితే కోట్లవుతుంది. అయినా పర్వాలేదు.. ప్రత్యర్థి కన్నా మన ప్రచారం అదిరి పోవాలన్నదే ముఖ్యం.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచార తీరు చూస్తే అన్ని పరిమితులను దాటేసిందనిపిస్తుంది. ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న యువకులు రోజుకు ఏడెనిమిది వందలు తీసుకునే ప్రచార కూలీలుగా మారారు. ఈ నెల రోజులు వారికి నిత్యం బీరు, బిర్యానీ. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టరాదన్నది ఎన్నికల నిబంధన. ప్రలోభాలకు లొంగినా కూడా నేరమే. సెక్షన్‌ 171(3) ప్రకారం ఏడాది చిప్పకూడుతో పాటు జరిమానా కూడా పడుతుంది.

ఎట్టకేలకు హుజురాబాద్‌ ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 30న పోలింగ్‌. ప్రచారం హోరాహోరీగా సాగింది. మాటల తూటాలు పేలాయి. మంత్రి హరీశ్‌రావు గులాబీ పార్టీ ప్రచార బృందానికి కెప్టెన్‌ వ్యవహరించారు. తన టీంతో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. బీజేపీ కూడా కూడా అంతే.. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, నిత్యానందరాయ్‌, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ ఈటల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్‌ తరఫున పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌ ప్రచారంలో పాల్గొన్నారు.

ఇప్పటివరకు వీధుల్లో హోరెత్తించిన నేతలు ఇప్పుడు తెర వెనక మంత్రాంగానికి రెడీ అయ్యారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలే డబ్బులు పంచుతున్నాయని టీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్ నేతలు ఒక్కో ఓటుకు ఏకంగా 20 వేలు ఇస్తున్నారన్నది బీజేపీ ఆరోపణ.

నిజానికి ప్రచార పర్వంలో నేతలు ఏం చెప్పినా ..ఎన్ని వాగ్ధానాలు చేసినా పోలింగ్‌ ముందు రెండు రోజులే చాలా కీలకం. అసలు సిసలు రాజకీయమంతా ఈ రెండు రోజుల్లోనే జరుగుతుంది. సీక్రెట్‌గా నగదు పంపిణీ.. చీకటి పడగానే మద్యం సీసాలు బయటకొస్తాయి. తాయిలాలు, ప్రలోభాలతో రాత్రికి రాత్రే సీన్‌ మారే అవకాశం ఉంది. వాటిని అడ్డుకోవడం అధికార యంత్రాంగం.. పోలీసు యంత్రాంగం ముందున్న పెద్ద సవాల్‌.
-Dr. Ramesh Babu Bhonagiri

Exit mobile version