ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కొత్త మద్యం దుకాణాల కోసం ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా 65,456 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మరికొన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు ఫీజు రూ.2లక్షలు ఉండగా.. ఈ మొత్తం దరఖాస్తులతో రూ.13.91 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా, ఒక్కో వైన్ షాప్ కి సరాసరి 25 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కో షాప్ కి సుమారు గా 51 దరఖాస్తులు రాగా, నిర్మల్ లో తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 20 న లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.