హుజూరాబాద్‌లో గెలవటం ఎలా? ఏం చేస్తే గెలుస్తాం? ఒకటి డబ్బు ..రెండు హామీలు. కుల సమీకరణలు ఎలాగూ ఉంటాయి. కానీ వాటికి కూడా ఈ రెండే అవసరం. అధికార పార్టీ ఈరెండింటినే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. జోరుగా హామీల వర్షం కురిపిస్తోంది. గులాబీ పార్టీ వారు ఓటుకు పది వేలు ఇస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. మరోవైపు, బీజేపీ కూడా బాగానే ముట్టచెపుతోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన బై ఎలక్షన్‌గా మారుతోందన్నది మాత్రం నిజం.
టీఆర్ఎస్ ఎన్నో ఉప ఎన్నికలను చూసింది. హుజూరాబాద్ ఎలక్షన్ చాలా చిన్నది. ఈ ఉప ఎన్నికతో ప్రభుత్వం కూలిపోయేది లేదు. మేమేదో కేంద్రంలో అధికారంలోకి వచ్చేదీ లేదు.. సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ పదే పదే చెపుతున్న మాటలు ఇవి. వారే కాదు ఏ టీఆర్‌ఎస్ నాయకుడిని పలకరించినా ఇదే అంటారు. ఈ ఎన్నికలు తాము చాలా లైట్‌గా తీసుకుంటున్నామని చెప్పే ప్రయత్నం వారిది. మరి అలాంటప్పుడు ఇంతలా ఎందుకు ఖర్చు చేస్తేన్నారని అడిగితే మాత్రం సమాధానం రాదు.
అసలు ఈ ఎన్నికల్లో ఎందుకు ఇంత భారీగా ఖర్చుపెడుతున్నారు. గెలిస్తే గెలుస్తారు ..ఓడితే ఓడుతారు. ఎలాగూ రెండేళ్లకు మళ్లీ ఎన్నికలు వస్తాయి కదా. కేవలం ఈ రెండేళ్ల కోసం ఎందుకింత హడావుడి. నిజమే, సాధారణ ఉప ఎన్నిక అయితే అలాగే అనుకోవచ్చు. కానీ ఇది అసాధారణమైనది. ఒకరి ఆత్మగౌరవానికి…మరొకరి రాజకీయ ప్రతిష్టకు హుజురాబాద్ ఒక సవాల్ గా మారింది. అందుకే ఈ కనివినీ ఎరుగని ధనప్రవాహం.
ప్రధాన ప్రత్యర్థులు టీఆర్‌ఎస్, బీజేపీ ఒక్క ఓటు వదలకుండా లెక్కలేస్తున్నారు. సామాజిక వర్గాల వారిగా లెక్కలు కట్టి ప్యాకేజీలు ఇస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు హూజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలలో పరిస్థితి ఎలా వుందంటే .. గ్రామ పంచయతీ ఎన్నికలని మించిపోయింది. అంతలా టెన్షన్ నెలకొంది గ్రామాలలో. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఘర్షణ వాతావరణం నెలకొంటోంది.
ప్రభుత్వ పథకాల రూపంలో వందల కోట్ల నిధులు ఇప్పటికే నియోజకవర్గానికి చేరాయి. 2,444 కోట్లు రిలీజ్ అయినట్టు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల షెడ్యూలు ప్రకటించక ముందే నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఎన్నికల ప్రకటన వెలువడితే ఆ వీలు ఉండదు. అందుకే తెలవిగా ముందే పథకాలకు ఫండ్స్ రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త పథకాలతో పాటు ఇప్పటికే అమలవుతోన్న రైతుబంధు వంటివి ఉండనే ఉన్నాయి. కొత్తగా తెచ్చిన దళిత బంధు స్కీం కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాల్లోకి పది లక్షల చొప్పున నిధులు జమచేసింది. ఈ పథకం అమలుకు 21 వేల దళిత కుటుంబాలను లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు.
జిల్లా ప్రణాళికా కార్యాలయం ప్రత్యేక అభివృద్ధి నిధి కింద హుజూరాబాద్ నియోజకవర్గానికి 100 కోట్లు విడుదలయినట్టు తెలుస్తోంది. గ్రామాలలో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం కోసం ఈ నిధులు ఖర్చుచేస్తారు. ఇప్పటికే 50 శాతం పనులను పూర్తయినట్టు సమాచారం.
ఇక రైతు బంధు కింద 59 కోట్ల 82 లక్షల రూపాయలు రైతులకు పంపిణీ చేశారు. ప్రాధామ్యాలను బట్టి గొర్రెల పంపకం జరుగుతోంది. ఇప్పటి వరకు 2, 800 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. వీటి విలువ 80 కోట్ల రూపాయలు.
ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిచిస్తున్నా ప్రజలు ఆ క్రెడిట్‌ని ఈటలకు ఇవ్వటం విచిత్రంగా అనిపిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఈటల రాజీనామా చేయటం వల్లే ప్రభుత్వానికి అకస్మాత్తుగా తమ మీద ప్రేమ పుట్టిందని నియోజకవర్గంలో గుసగుస. ఎలా అయితేనే హుజూరాబాద్ ప్రజల మంచికే వచ్చాయి ఈ ఎన్నికలు. ప్రభుత్వం ఇప్పటి వరకు అన్ని పథకాలకు కలిపి నాలుగు వేల కోట్లకు పైనే విడుదల చేసిందని అంచనా.
ప్రభుత్వం అధికారికంగా చేస్తున్న ఖర్చు ఒక ఎత్తయితే అనధికారిక ఖర్చు మరో ఎత్తు. ప్రచార సభలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి. ప్రచారంలో పాల్గొనే కార్యకర్తల ఖర్చులు ..వాహనాలకు అయ్యే ఖర్చు ఇలా బోలెడు ఉంటాయి. అన్నీ కలిపిదే పది వేల కోట్లు దాటినా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదు.
ఇవిగాక ఓటర్లకు మద్య మాంసాలు పంపే పరిస్థితికి దిగజారింది రాజకీయం. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అధికార పార్టీపై స్వయంగా ఈ ఆరోపణలు చేశారు. ప్రజల గొంతుకగా ప్రశ్నించే తనను రాజకీయంగా అంతం చేసే కుట్ర జరుగుతోందని..అందుకు వేలాది కోట్లు కోట్లు ఖర్చు చేస్తోందని అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు ఈటల.
ఇక ఈ ఎన్నికల్లో ఎవరు ఎంత ఖర్చు చేసినా దానిని కులం ఆధారంగానే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏ కులానికి ఎన్ని ఓట్లున్నాయనే ప్రాతిపదికన తాయిలాలు అందిస్తున్నట్టు సమాచారం. హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండు లక్షల పాతిక వేలకు పైగా ఓటర్లున్నారు. వారిలో మాదిగలు 35 వేల 600 వేల ఓట్లతో ముందున్నారు. తరువాత మున్నూరు కాపు 29 వేల 100, పద్మశాలీలు 26 వేల 350, గౌడ 24 వేల 200, ముదిరాజ్ 23 వేల 220, రెడ్డి 22 వేల 600, యాదవ 12, 500, మాల 11 వేల 100 కాగా ఇతర కులాలన్నీ కలిపి ముప్పయ్ వేలకు పైగా ఉన్నాయి. వీటికి తోడు 10 వేల కొత్త ఒట్లు నమోదయ్యాయి.
కులాల వారిగా ఓట్ల సమీకరణలోనూ అధికార వ్యూహాత్మకంగా వెళుతోంది. ఆత్మీయసభల ద్వారా వారి మద్దతు కూడగడుతోంది. ప్రచారం ముగింపు నాటికి అన్ని కులాల వారితో ఈ సామావేశాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ టార్గెట్‌గా పెట్టుకుంది. వీటిని నియోజకవర్గ స్థాయిలో నిర్వహించటానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు వివిధ సామాజిక సంస్థలు, అసోసియేషన్లు, అన్ని కార్మిక సంఘాలతో కూడా టీఆర్‌ఎస్ నేతలు మీటింగ్‌లు పెడుతున్నారు. ఇంత చేసినా టీఆర్‌ఎస్ గెలుపు జెండా ఎగురుతుందా..లేదంటే ఈటల ఆత్మగౌరవానికే హుజూరాబాద్ ఓటరు జైకొడతారా.. చూడాల్సి వుంది!