అపజయాలను ఖాతరు చేయకండి.
అవి చాలా సహజమైనవి. అంతేకాదు,
అవి జీవిత సౌందర్యాన్ని పెంచుతాయి.
వెయ్యిసార్లు అపజయాన్ని చూసినప్పుడు..
మరోసారి ప్రయత్నించాలన్న ఆదర్శాన్ని
పదే పదే గుర్తుచేసుకోండి.
– సుభాష్ చంద్రబోస్
పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి.
అవి మీ జీవిత గమనానికి ఆటంకమవుతాయి.
ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే.. మీరు పిరికివారవుతారు.
– నేతాజీ సుభాష్ చంద్రబోస్
ఇవి నేతాజీ చెప్పిన మాటలు.. నేతాజీ పేరు వినగానే ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతుంది. జాతి మొత్తం పులకిస్తుంది. గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో చేరారు. కానీ.. బాపూ నిర్ణయాలనే నిర్మొహమాటంగా విభేదించారు బోస్. నేతాజీ సాగించిన పోరాటం దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచింది. సాయుధ సంగ్రామమే మార్గమని ప్రకటించి, స్వతంత్ర భారతావని ఒక్కటే మనకు స్వర్గమని చాటి, ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకొని ఆంగ్లేయులతో యద్ధం చేశాడు. ప్రతి పౌరుడు సైనికుడిగా మారి ప్రాణార్పణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. ఎనిమిది దేశాల గుర్తింపు పొందిన సమాంతర భారత ప్రభుత్వాన్ని స్థాపించాడు. దేశ స్వాతంత్య్ర సమరాన్ని అంతర్జాతీయ వేదికలకు చేర్చి, బ్రిటిషర్లకు కునుకు లేకుండా చేశాడు. ఆయన సాహసాలు, తెగింపు, త్యాగాలు దేశ ప్రజల్లో స్వాతంత్య్రకాంక్షను తీవ్రంగా రగిలించాయి. “స్వాతంత్ర్య ఇవ్వ లేదు.. లాక్కున్నాం..” అన్నారు నేతాజీ.. “నాకు రక్తం ఇవ్వండి.. నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను” అంటూ యువతకు ప్రేరేపించారు. ఆయన చరిత్ర గురించి మనం తెలుసుకుందాం..
బోస్ పుట్టింది ఇక్కడే…
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897, జనవరి 23న ఒడిశాలోని బెంగాల్ డివిజన్‌లోని కటక్‌లో జన్మించారు. బోస్ తన తల్లిదండ్రులకు తొమ్మిదవ సంతానం. బోస్ నాటి కలకత్తాలో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత తదుపరి చదువుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. ఆ కాలంలో అత్యున్నతమైన ఉద్యోగాల కోసం జరిగే పరీక్ష ఐసీఎస్. ఈ పరీక్షలో బ్రిటన్ దేశానికి చెందిన వాళ్ళు, బ్రిటన్ అధికారుల పిల్లలు నాలుగైదు సార్లు ప్రయత్నం చేసినా పాస్ అవడం అసాధ్యం. ఇలాంటి పరీక్షను 1921లో కేవలం 24 సంవత్సరాల వయసులో రాసి మొదటి ప్రయత్నంలోనే కేవలం 6 నెలల కాలంలో డిస్టింక్షన్లో పాస్ అయ్యారు సుభాష్ చంద్రబోస్. అలా ఉన్నతమైన ఉద్యోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ వెంటనే ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. అప్పటినుంచి సుభాష్ చంద్రబోస్ మీద విపరీతమైన కక్షను పెంచుకుంది బ్రిటిష్ ప్రభుత్వం.1924లో బ్రిటిష్ పార్లమెంటులో ఆయన గురించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎంత గంభీరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలోనే దాదాపు 11 సార్లు ఆయనను మాండలే జైల్లో వేసి, చిత్రహింసలకు గురి చేశారు.
గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన బోస్…
సుభాష్ చంద్రబోస్ రాజకీయ జీవితాన్ని అతడి రాజకీయ గురువైన చిత్తరంజన్ దాస్ ప్రభావితం చేశారు. ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో నిర్భయంగా వ్యవహరించేవారు. చౌరిచౌరాలో జరిగిన ఒక హింసాయుత సంఘటన నేపథ్యంలో గాంధీజీ 1922, ఫిబ్రవరి 5న ఉద్ధృతంగా సాగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపేశారు. ఆ నిర్ణయాన్ని బోస్ తప్పుబట్టారు. ఉద్యమాన్ని నిలిపేయడాన్ని జాతీయ విపత్తుగా అభివర్ణించారు. ఆ తర్వాత చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ స్వరాజ్య పార్టీ (1922) స్థాపన, దాని నిర్వహణలో సహాయం అందించారు. 1935 భారత ప్రభుత్వ చట్టం పట్ల కూడా విముఖత వ్యక్తం చేశారు. అలాంటి చర్యలను ఆమోదిస్తే స్వాతంత్య్ర పోరాట స్వభావంలో ఏ అభివృద్ధి ఉండదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌ను విమర్శించిన నేతాజీ..
1938లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన (ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు) గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఉన్న హరిపురా గ్రామంలో జరిగింది. 1939లో నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పుర్ జిల్లా త్రిపురిలో జరిగిన కాంగ్రెస్ సమావేశ అధ్యక్ష పదవికి బోస్ పోటీ చేశారు. గాంధీజీ నిలబెట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్యపై విజయం సాధించి, కాంగ్రెస్‌లో తన పలుకుబడి నిరూపించుకున్నారు. తర్వాత గాంధీజీతో ఏర్పడిన అభిప్రాయ భేదాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. చాలా విషయాల్లో గాంధీ నిర్ణయాలను బోస్ వ్యతిరేకించారు. గాంధీ పాటించిన అహింసా నినాదానికి బోస్ పూర్తి వ్యతిరేకి.. పోరాటంతోనే ఏదైనా సాధ్యమవుతుందని బోస్ నమ్మేవారు..
రెండో ప్రపంచ యుద్ధం..
1939 చివర్లో యుద్ధం ప్రారంభమైంది. గాంధీజీ బోధించిన అహింసాయుత విధానాల పట్ల కొంతమంది నాయకుల్లో భ్రమలు తొలగిపోవడం మొదలైంది. స్వాతంత్య్ర సాధనకు సాయుధ పోరాటమే మార్గమని, అవసరమైతే విదేశీ సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. వారిలో సుభాష్ చంద్రబోస్ ఒకరు. యుద్ధకాలంలో ఆయన దేశమంతా పర్యటించాడు. గాంధీజీ అహింసా విధానం, నెహ్రూ మిత్ర రాజ్యాల కూటమి అనుకూల విధాన భావనలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని, వలసవాద విధానాలను బహిరంగంగా విమర్శించాడు. యుద్ధ ప్రక్రియలో బ్రిటిషర్లకు, భారతీయులు సహకరించకూడదని సూచించాడు. దేశప్రజలకు తీవ్రవాద సిద్ధాంతాలు నూరిపోస్తున్నాడనే నెపంతో 1940లో ప్రభుత్వం బోస్‌ను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత విడుదల చేసి గృహనిర్బంధంలో ఉంచింది. స్వాతంత్య్ర పిపాసకుడైన బోస్ 1941లో గృహనిర్బంధం నుంచి చాకచక్యంగా తప్పించుకొని పెషావర్, కాబూల్ మీదుగా జర్మన్ నగరం బెర్లిన్ చేరాడు. రెండో ప్రపంచయుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో భారతదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వ్యతిరేకులైన హిట్లర్, రిబ్బన్ ట్రాప్ లాంటి జర్మన్ నాయకులతో సంప్రదింపులు జరిపి సహాయం కోరాడు. బెర్లిన్ రేడియో ద్వారా భారతీయులకు సందేశం ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. జర్మనీ నుంచి ఆశించినంత సహాయం లభించకపోవడంతో అక్కడి నుంచి జపాన్ చేరారు.
ఆజాద్ హిందు ఫౌజ్ స్థాపన..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు వినగానే ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఆలోచన వస్తుంది. ఆజాద్ హింద్ ఫౌజ్‌ను కెప్టెన్ మోహన్ సింగ్, రాష్ బిహారీ బోస్ 1942లో ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)ని స్థాపించారు. సుభాష్ చంద్రబోస్ 21 అక్టోబర్ 1943న సింగపూర్‌లోని ఆజాద్ హింద్ ఫౌజ్ (INA)కి నాయకత్వం వహించారు. 1943 అక్టోబర్ 21 ఈ రోజున ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిని జర్మనీ, జపాన్, ఫిలిప్పీన్స్, కొరియా, చైనా, ఇటలీ, మంచుకువో, ఐర్లాండ్‌తో సహా 11 దేశాల ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి జపాన్ అండమాన్ నికోబార్ దీవులను ఇచ్చింది. జపాన్, జర్మనీల సహకారంతో సాయుధ మార్గంలో భారత్‌కు విముక్తి కల్పించాలని సంకల్పించారు. అదే క్రమంలో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేశారు. నేతాజీ ఆ దీవులకు వెళ్లి వాటికి మళ్లీ పేరు పెట్టారు. ఈ ప్రభుత్వాన్ని ఆజాద్ హింద్ సర్కార్ అని పిలుస్తారు. ఈ ప్రభుత్వం తన సైన్యం నుంచి బ్యాంకు వరకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
16 మంది సభ్యులతో ఓ కోర్ కమిటీ ఏర్పాటు..
ఆజాద్ హింద్ ఫౌజ్‌లో రాష్ట్రపతి, ప్రధాని, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రులను సుభాస్ బోస్ ఏర్పాటుచేశారు. దేశ నిర్మాణం నుంచి అనేక స్థాయి వ్యక్తులను నియనించారు. బ్రిటిష్ వారిని వారి స్నేహితులను భారతదేశం నుంచి బహిష్కరించడం తాత్కాలిక ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. భారతీయుల కోరిక మేరకు వారి విశ్వాసం మేరకు ఆజాద్ హింద్ శాశ్వత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో పడింది నేతజీ సైన్యం. తాత్కాలిక ప్రభుత్వంలో సుభాష్ చంద్రబోస్ ప్రధాన మంత్రి అయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రి కూడా అయ్యారు. ఇది కాకుండా ఈ ప్రభుత్వంలో మరో ముగ్గురు మంత్రులను ఏర్పాటు చేశారు. 16 మంది సభ్యులతో ఓ కోర్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు.
ఈ ప్రభుత్వాన్ని గుర్తించిన పలు దేశాలు…
బోస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని జర్మనీ, జపాన్, ఫిలిప్పీన్స్, కొరియా, ఇటలీ, మంచుకువో, ఐర్లాండ్ ప్రభుత్వాలు గుర్తించాయి. జపాన్ ఆధీనంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులను తాత్కాలిక ప్రభుత్వా ఏర్పాటు కోసం నేతాజీ ఇచ్చింది. వెంటనే నేతాజీ ఆ దీవులకు చేరుకున్నారు. ఆ దీవులకు కొత్త పేరు పెట్టారు. అండమాన్ పేరును షహీద్ ద్వీప్ అని నామకర్ణం చేశారు. నికోబార్ పేరును స్వరాజ్య ద్వీపం అని మార్చారు. 30 డిసెంబర్ 1943 న ఈ ద్వీపాలలో స్వతంత్ర భారతదేశం జెండా కూడా ఎగురవేశారు. దీంతో బ్రిటీష్ సర్కార్ ఫోకస్ ఫెట్టింది. నేతాజీ పాలనలో ఉన్న ప్రాంతాలపై యుద్ధం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత నేతాజీ మరో పిలుపునిచ్చారు. బ్రిటషర్లను, వారి తొత్తులను ఎదిరించేందుకు “ఛలో ఢిల్లీ” అంటూ పిలిపునిచ్చారు. భారత్‌లోని బ్రిటన్ పాలకులపై ఇండో- బర్మా సరిహద్దులో యుద్ధం ప్రకటించారు. ఇంఫాల్-కోహిమా సెక్టార్‌లో కూడా జపాన్ సేనలతో కలిసి ఆజాద్ సైన్యం పోరాటం చేసింది. ఓటమి చవిచైసిన బ్రిటీష్ సైన్యం ఆలోచనల్లో పడింది. ఇక భారత్‌ను ఎక్కవ రోజులు పాలించలేమనే భావన తెల్లవారు పడిపోయేలా చేసింది. బ్రిటషర్ల దాడులను వెంటనే తిప్పి కొట్టారు ఆజాద్ సైన్యం. ఇలా ఇంఫాల్, కోహిమా సరిహద్దులలో అనేక సార్లు భారత బ్రిటిష్ సైన్యం యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ చేతిలో ఓడిపోయింది.
యుద్ధ విమానం కూలి…
కాగా.. 1945, ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ద విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నేతాజీకి సంబంధి వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది. అయితే, బోస్ జయంతిని పరాక్రమ్ దివస్‌గా భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్వాత్రంత్ర్య సమర యోధుడిని జయంతి సందర్భంగా ఆయన్ని మరోసారి స్మరించుకుందాం..