ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగు చిత్రసీమలో వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ విజయయాత్ర చేసిన స్టార్ హీరో వెంకటేశ్ అనే చెప్పాలి… తొలి నుంచీ వరైటీ రోల్స్ లో అలరిస్తూ సక్సెస్ రూటులో సాగుతున్నారాయన… కొన్నిసార్లు ట్రాక్ తప్పినా, మళ్ళీ వైవిధ్యంతోనే విజయపథాన్ని చేరుకుంటున్నారు…
కాలానికి అనుగుణంగా సాగుతున్నారు వెంకటేశ్… నవతరం స్టార్స్ తోనూ జోడీ కడుతూ వినోదం పండిస్తున్నారు… మరోవైపు తన వయసుకు తగ్గ పాత్రలతో ఓటీటీలోనూ సందడి చేస్తున్నారు… ఆ తీరున సాగుతున్న ఏకైక స్టార్ హీరో వెంకటేశ్ అనే చెప్పాలి…
వెంకటేశ్ తండ్రి డి.రామానాయుడు చిత్రసీమలో అడుగు పెట్టడానికి స్ఫూర్తి నిచ్చింది ‘నమ్మిన బంటు’ చిత్రం… ఆ సినిమా షూటింగ్ రామానాయుడు స్వస్థలం కారంచేడులో షూటింగ్ జరుపుకుంది… ఆ చిత్ర నిర్మాత యార్లగడ్డ వెంకన్న చౌదరి, నాయుడుకు బంధువు… దాంతో షూటింగ్ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన్నారు నాయుడు… ఆయన చురుకుతనం చూసి చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు “మీరూ…సినిమా రంగంలోకి…” రావచ్చు కదా అని అన్నారు.. ఆ మాటతోనే నాయుడుకు సినిమా రంగంపై ఆసక్తి నెలకొంది… ‘నమ్మినబంటు’ 1960 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలై విజయం సాధించింది… అదే సంవత్సరం డిసెంబర్ 13న నాయుడు రెండో కొడుకుగా వెంకటేశ్ జన్మించారు…
వెంకటేశ్ పుట్టాక కొన్నాళ్ళు రైస్ మిల్లు నడిపారు రామానాయుడు. తరువాత మద్రాసు చేరి ‘అనురాగం’ సినిమాకు నిర్మాణభాగస్వామిగా ఉన్నారు. తరువాత సొంతగా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నెలకొల్పారు. ఆ సంస్థ బ్యానర్ లోగోలో కనిపించే ఇద్దరబ్బాయిలు – వెంకటేశ్, ఆయన అన్న సురేశ్ బాబు
రామానాయుడు తొలి ప్రయత్నంగా యన్టీఆర్ తో ‘రాముడు-భీముడు’ నిర్మించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తరువాత రామానాయుడుకు మళ్ళీ ఆ స్థాయి హిట్ లభించలేదు. దాంతో ఉంటే మదరాసులో ఉందాం… లేదంటే ఊరెళ్ళి పోదాం అనుకున్నారు. భారీ వ్యయంతో నవలాచిత్రంగా ‘ప్రేమనగర్’ నిర్మించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. దాంతో రామానాయుడు సినిమా రంగంలోనే కొనసాగారు. విశేషమేమంటే – ఈ సినిమాలో వెంకటేశ్ బాలనటునిగా, చిన్నప్పటి సత్యనారాయణ పాత్రలో నటించారు.
అలా తండ్రికి అచ్చివచ్చిన వారసుడు అనిపించుకున్నారు వెంకటేశ్.
1986లో వెంకటేశ్ ను హీరోగా పరిచయం చేస్తూ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘కలియుగ పాండవులు’ నిర్మించారు రామానాయుడు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది.
తరువాత వచ్చిన చిత్రాలేవీ అంతగా అలరించలేదు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ‘బ్రహ్మపుత్రుడు’ నిర్మించారు రామానాయుడు. ఈ సినిమాతో మాస్ కు చేరువయ్యారు వెంకటేశ్.
చిరంజీవి, బాలకృష్ణ తెరపై కలసి కనిపించిన ఏకైక చిత్రం ‘త్రిమూర్తులు’. ఈ సినిమాలో వెంకటేశ్ హీరో. హిందీ ‘నసీబ్’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని టి.సుబ్బరామిరెడ్డి నిర్మించారు. ఇదే సీన్ లో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా కనిపించడం విశేషం!
‘ప్రేమ’ చిత్రం ద్వారా 1988 సంవత్సరం ఉత్తమ నటునిగా నంది అవార్డును అందుకున్నారు వెంకటేశ్. ఇదే ఆయన బెస్ట్ యాక్టర్ గా అందుకున్న తొలి నంది అవార్డు.
తరువాత ‘ధర్మచక్రం’ ద్వారా 1995 ఉత్తమనటునిగానూ నందిని సొంతం చేసుకున్నారు వెంకటేశ్.
ఆపై 1998లో ‘గణేశ్’ చిత్రం ద్వారా, 1999లో ‘కలిసుందాం…రా’ సినిమాతోనూ ఉత్తమ నటునిగా నంది అవార్డులను అందుకున్నారు.
2007లో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రంతోనూ ఉత్తమనటునిగా నందిని తనతో తీసుకువెళ్ళారు వెంకటేశ్. ఇలా మొత్తం ఐదు సార్లు ఉత్తమనటునిగా నిలచిన ఏకైక హీరోగా వెంకటేశ్ చరిత్ర సృష్టించారు.
తన తరం హీరోలలో రీమేక్స్ తో ఎక్కువ విజయాలను చూసిన ఘనత వెంకటేశ్ కే దక్కుతుంది. వెంకటేశ్ తొలిసారి నటించిన రీమేక్ ‘భారతంలో అర్జునుడు’. హిందీలో విజయం సాధించిన ‘అర్జున్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కానీ, ఇది పరాజయం పాలయింది.
తరువాత హిందీ ‘నసీబ్’ ఆధారంగా వెంకటేశ్ ‘త్రిమూర్తులు’ రూపొందింది. ఇది ఏవరేజ్ గా ఆడింది. తమిళ చిత్రం ‘తాయ్ మేల్ ఆనై’ ఆధారంగా తెరకెక్కిన ‘రక్తతిలకం’ వెంకటేశ్ కు విజయాన్ని అందించింది.
తమిళ ‘చిన్నతంబి’ ఆధారంగా రూపొందిన ‘చంటి’ 1992 బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఆ సినిమా ఘనవిజయంతో వరుసగా “చినరాయుడు, సుందరకాండ, కొండపల్లి రాజా, అబ్బాయిగారు” రీమేక్స్ లో నటించారు వెంకటేశ్.
తమిళ చిత్రం ‘తాయ్ కులమే తాయ్ కులమే’ ఆధారంగా వెంకటేశ్ ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’ తెరకెక్కి, విజయం సాధించింది. “సూర్యవంశం, రాజా” చిత్రాలు సైతం రీమేక్స్ గా తెరకెక్కి వెంకటేశ్ కు ఘనవిజయాలను అందించాయి.
వెంకటేశ్ నటించిన “జెమినీ, సంక్రాంతి, ఈనాడు, నాగవల్లి, బాడీగార్డ్, మసాల, దృశ్యం, గోపాల గోపాల, గురు, నారప్ప, దృశ్యం-2” చిత్రాలు సైతం రీమేక్స్ కావడం విశేషం. అంటే వెంకటేశ్ ఇప్పటికీ రీమేక్స్ పై ఆధారపడి సాగుతున్నారని చెప్పవచ్చు.
“జయమ్ము నిశ్చయమ్మురా, సోగ్గాడు, కృష్ణం వందే జగద్గురుమ్, ప్రేమమ్, అజ్ఞాతవాసి” చిత్రాలలో అతిథిగా కనిపించారు వెంకటేశ్.
‘గురు’ చిత్రంలో “జింగిడి…” పాటతో గాయకునిగానూ మారారు వెంకటేశ్.
టాప్ స్టార్స్ లో ఓటీటీ బాట పట్టిన తొలి హీరో వెంకటేశ్ అనే చెప్పాలి. ఆయన నటించిన “నారప్ప, దృశ్యం-2” నేరుగా ఓటీటీల్లో విడుదలై అలరించాయి.
నెట్ ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు వెంకటేశ్. అందులో నాయుడు పాత్రలో ఆయన కనిపించనున్నారు.
ఇలా ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని ఆసరా చేసుకొని సాగుతున్న వెంకటేశ్ మునుముందు ఏ తీరున అలరిస్తారో చూడాలి.