బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి… ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా.. బలమైన ఈదురు గాలులు కూడా ఇబ్బంది పెడుతున్నాయి.. ఏపీలోని తీర ప్రాంతాల్లో కూడా గంటకు 50-60 కిలోమీటర్ల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు… అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు దంచికొడుతుండగా… ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది వాతావరణ శాఖ. మరోవైపు.. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇక, కడప జిల్లాలోని రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేటలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.. రాయచోటిలో 7 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి.. పలు గ్రామాలకు పాక్షికంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేల ఎకరాల్లో వరి, వేరుశనగ, టమోటా, బొప్పాయి, అరటి, చీని పంటలకు నష్టం జరిగింది.. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు అధికారులు.. అన్నమయ్య ప్రాజెక్టులో 24 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండగా.. పించ జలాశయం గేట్లు ఎత్తివేశారు.. ఇక, జిల్లాలో మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు కలెక్టర్, ఎస్పీ… కడప , రాజంపేట, జమ్మలమడుగులో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.
మరోవైపు చిత్తూరు విషయానికి వస్తే.. భారీ వర్షం కారణంగా తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేసిన అధికారులు.. అయితే, రాత్రి నుంచి కాస్త వర్షం తగ్గడంతో.. ఉపిరి పీల్చుకున్నారు తిరుపతి ప్రజానీకం.. ఓవైపు మమ్మురంగా సహాయక చర్యలు కొనసాగుతండగా.. మళ్లీ ఘాట్‌రోడ్డులో వాహనాలకు అనుమతి ఇస్తున్నారు..అయితే, ఇవాళ కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. చంద్రగిరిలో భీమా, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. నాగయ్యగారిపల్లి వద్ద వంతెన కొట్టుకుపోయింది.. దీంతో 20 గ్రామాలకు రాకపోలకు నిలిచిపోయాయి.. ఇక, తుఫాను హెచ్చరికలతో ప్రకాశం జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.. సముద్రతీర ప్రాంతం ఉన్న 11 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను అప్రమత్తం చేశారు.. తీరంలో లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 11 మండలాల్లో 40 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.. ఫిర్యాదులు స్వీకరించేందుకు 08592-281400, టోల్ ఫ్రీ నెంబర్ 1077 ఏర్పాటు చేశారు అధికారులు.
ఇక, నెల్లూరు జిల్లాలో తుఫాను కారణంగా సోమశిల జలాశయానికి భారీగా వరద పెరిగింది.. ఎగువ నుండి 46,945 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. భారీ వర్షాల కారణంగా నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు.. మరోవైపు, వర్షాల కారణంగా మూడువేల ఏకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.. వర్షాలు తగ్గు ముఖంపడితే పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనాలు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక, అనంతపురం జిల్లా కూడా వర్షాలు కురుస్తున్నాయి.. తాడిపత్రి మండలంలో 10.6 మిల్లీ మీటర్లు, పుట్లూరు మండలంలో 16.6 మిల్లీ మీటర్లు, పెద్దపప్పూరులో 3.2 మిల్లి మీటర్లు, పెద్దవడుగూరులో 14.6 మిల్లి మీటర్లు, యల్లనూరులో 24.4 మిల్లి మీటర్లు, యాడికి మండలంలో 10.4 ఎంఎం వర్షపాతం నమోదైంది.. అయితే, మరో రెండు రోజుల వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు.
