ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలలో వరదలు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో భారీ స్థాయిలో వరద నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ప్రస్తుతం వరద కొంచెం తగ్గుముఖం పట్టడంతో అధికారులు వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వరదల వల్ల మొత్తం రూ. 6,054 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది.
Read Also: ఈ నెల 26 నుంచి రైతుల పాదయాత్రకు జనసేన
వరదల కారణంగా వ్యవసాయ రంగానికి రూ.1,354 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 1,42,862 ఎకరాల్లో పంటలు నష్టపోయాయని అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు. మరోవైపు రహదారులు డ్యామేజ్ కావటం వల్ల జరిగిన నష్టం రూ.1,756 కోట్లు అని వెల్లడించారు. పట్టణాభివృద్ధి శాఖలో నష్టం అంచనా రూ.1,252 కోట్లు ఉండగా… డ్యాములు, సాగునీటి శాఖకు జరిగిన నష్టం అంచనా రూ.556 కోట్లుగా వారు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రాథమిక నష్టం అంచనా వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు వారు తెలిపారు.
మరోవైపు వరద నష్టంపై ఇప్పటికే సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వరదల్లో భారీ ఎత్తున నష్టపోయిన ఏపీకి తక్షణ సాయం కింద రూ. 1000 కోట్లు కేటాయించాలని లేఖలో ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు.