వస్తు సేవల పన్ను రికార్డు స్థాయిలో వసూలు అవుతోంది. జులై 2021లో రూ.1,16,393 కోట్లు రాగా.. ఆగస్టు మాసానికి రూ.1,12,020 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆగస్టులో వచ్చిన మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.20,522 కోట్లుగా ఉంది. స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.56,247 కోట్లుగా ఉన్నాయి. వీటితో పాటు సెస్సుల రూపంలో మరో రూ.8646 కోట్లు చొప్పున వసూలైనట్టు కేంద్రం వెల్లడించింది. జులై నెలతో పోలిస్తే ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు స్వల్పంగా తగ్గాయి. గతేడాది ఆగస్టులో 86,449 కోట్లు వస్తే… ఈ సారి 30శాతం అధికంగా వచ్చింది. అంతకముందు ఏడాదితో పోలిస్తే 14 శాతం పెరిగాయి. గతంలో వరుసగా తొమ్మిది మాసాల పాటు లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు.. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో పడిపోయింది. కొవిడ్ ఆంక్షలు సడలించడంతో వరుసగా జులై, ఆగస్టు మాసాల్లో రూ.లక్ష కోట్లు మార్కు దాటాయి.