గంజాయి, డ్రగ్స్ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. వాటి సరఫరాకు ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు కేటు గాళ్లు.. లారీలు, కార్లు, ఆటోలు, టూ విలర్, చివరకు విమానాల్లో కూడా మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున పట్టుబడుతూనే ఉన్నాయి.. కేజీలు, క్విటాళ్ల కొద్ది గంజాయి దొరికిన సందర్భాలు లేకపోలేదు. అయితే, స్మగ్లర్లు రూట్ మార్చారు.. ఆధునిక యుగంలో అంతా ఆన్‌లైన్ అయిపోయింది.. ఏ వస్తువు కావాలన్నా ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఇప్పుడు గంజాయి విక్రయాలు కూడా ఆన్‌లైన్ వేదికగా సాగడం మరింత కలవరానికి గురిచేస్తున్నాయి.. అమెజాన్‌ను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుండి మధ్యప్రదేశ్‌కు అక్రమంగా గంజాయి తరలించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు.. వీరి దగ్గర 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు..
Read Also: మంగళవారం దీక్షలు వాయిదా వేసిన వైఎస్ షర్మిల..
4 నెలలుగా సాగుతోంది:
గత 4 నెలలుగా అమెజాన్ ద్వారా సుమారు టన్ను గంజాయి అక్రమంగా రవాణా చేసినట్టు పోలీసుల విచారణ నిందితులు తెలిపినట్టు తెలుస్తోంది.. గ్వాలియర్‌లోని మోరార్‌కు చెందిన సూరజ్ అలియాస్ కల్లు పావయ్య, భింద్ జిల్లాలో రోడ్డు పక్కన దాబా నడుపుతున్న పింటూ అలియాస్ బిజేంద్ర సింగ్ తోమర్ అనే ఇద్దరు వ్యక్తులు.. 20 కిలోల నిషిద్ధ వస్తువులతో పట్టుబడ్డారు. గత నాలుగు నెలల్లో రూ. 1.10 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్టుగా భింద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సింగ్ వివరించారు.. ఈ లావాదేవీల్లో 66 శాతం ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తికి చెందిన కంపెనీకి వెళ్లిందని చెబుతున్నారు.. నిందితులను ప్రశ్నించిన తర్వాత, వారి సహాయకుడు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పట్టుబడ్డాడు. ఆన్‌లైన్ సైట్ ద్వారా సేకరించిన గంజాయి ప్రధానంగా భింద్‌లోని రోడ్డు పక్కన ఉన్న దాబా నుండి విక్రయించినట్టు గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ మరియు గ్వాలియర్ వంటి ఇతర నగరాలకు, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు రాజస్థాన్‌లోని కోటకు కూడా తరలించినట్టుగా పోలీసులు గుర్తించారు.
కరివేపాకు విక్రయదారిడి పనే..!
ఇక, ఈ వ్యవహారంపై అమెజాన్ స్పందించింది.. సమస్య మా దృష్టికి వచ్చింది.. ప్రస్తుతం దానిని పరిశీలిస్తున్నాం. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి దర్యాప్తులో అధికారులకు అవసరమైన పూర్తి సహకారం, మద్దతును అందిస్తామని తెలిపారు అమెజాన్ ప్రతినిధి.. ఇది కరివేపాకు విక్రయదారుడిగా నమోదైంది.. ఈ రాకెట్ యొక్క సూత్రధారి సూరజ్ పావయ్య గుజరాత్‌కు చెందిన ఒక టెక్స్‌టైల్ కంపెనీ వివరాలను ఉపయోగించి మూలికా ఉత్పత్తులు మరియు కరివేపాకు విక్రయదారుడిగా అమెజాన్‌లో నమోదు చేసుకున్నాడని అమెజాన్ వెల్లడించింది.. అయితే, ఈకామర్స్ దిగ్గజం తన వెబ్‌సైట్ ద్వారా ఇంత జరుగుతున్నా.. కనీసం తనిఖీ చేయడంలో విఫలం అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంలో అమెజాన్‌పై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. గంజాయి సరఫరాను సీరియస్‌గా తీసుకుని నోటీసులు పంపేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇక, ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ కూడా తప్పు చేసిందని మరియు నేరంలో భాగమని విచారణలో తేలితే.. 29 NDPS చట్టం కింద కేసు బుక్ చేయబడుతుందని బింధ్ జిల్లా పోలీసు చీఫ్ వెల్లడించారు. కాగా, గత కొంత కాలంగా గంజాయి పాలిటిక్స్ ఏపీలో కాకరేపుతున్నాయి.. ఇప్పుడు ఈ వ్యవహారం కూడా ఏపీకి లింక్ అవ్వడం కూడా మరోసారి రాజకీయ దుమారం రేపే అవకాశం లేకపోలేదు అంటున్నారు.
