వైవిధ్యానికి మారు పేరు భారతీరాజా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూలై 17న భారతీరాజా పుట్టినరోజు)
కథలో ఓ సమస్య, దానికి తగ్గ పరిష్కారం, నాయికానాయకులు కలుసుకోవడం లేదా విడిపోవడం – ఇదే అంతకు ముందు మన సినిమాల్లోని ఫార్ములా. అయితే నాయికానాయకులు కలుసుకుంటారా, లేదా అన్న అంశాన్ని ప్రేక్షకుల ఊహకే వదిలేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అలా సినిమా తీయాలనుకున్నారు భారతీరాజా. ఆయన చెప్పిన కథ విని కొందరు నొసలు చిట్లించారు. కొందరి ముక్కుపుటాలు అదిరాయి. మరికొందరు వెకిలిగా నవ్వారు. అయినా, అతని కథలో వైవిధ్యం ఉందని మాత్రం అందరూ అంగీకరించారు. అలా అంగీకరించి, భారతీరాజాలోని సరికొత్త ఆలోచనను ప్రోత్సహిస్తూ నిర్మాత ఎస్.ఏ.రాజ్ కన్ను సాహసం చేశారు. తత్ఫలితంగా వెలుగు చూసిన చిత్రమే భారతీరాజా ప్రప్రథమంగా తెరకెక్కించిన “16 వయదినిలే”. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ చిత్రంలో శ్రీదేవిని రేప్ చేయబోయిన రజనీకాంత్ ను కమల్ హాసన్ చంపేస్తాడు. తరువాత జైలుకు వెళతాడు. అతని రాకకోసం శ్రీదేవి ఎదురుచూస్తూ ఉంటుంది. పల్లెవాతావరణంలో రూపొందిన ఈ చిత్రం అంతకు ముందు వచ్చిన పల్లె ప్రేమకథలకు భిన్నంగా తెరకెక్కింది. హీరో, హీరోయిన్ ను కలుసుకుంటాడా లేదా అన్న అంశాన్ని ప్రేక్షకుల ఊహకే వదిలేశారు భారతీరాజా. అతని ఆలోచన ఫలించింది. తమిళ ప్రేక్షకులు ఈ చిత్రంలోని కొత్తదనానికి బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగారు భారతీరాజా. ఆయన తొలి చిత్రం తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’ పేరుతో శ్రీదేవి నాయికగానే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే తెలుగులో రెగ్యులర్ ఫార్ములాతోనే కథ సుఖాంతమవుతుంది. హీరో,హీరోయిన్ చివరకు కలుసుకుంటారు. ‘కొత్త జీవితాలు’ చిత్రంతో తెలుగుచిత్రసీమలో అడుగు పెట్టారు భారతీరాజా. తెలుగులోనూ భారతీరాజా తెరకెక్కించిన చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
తమిళనాడులోని తేని అల్లినగరంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి. వీరి తేని తాలూకాలోనే పన్నై పురంకు చెందినవారు ఇళయరాజా. బాల్యం నుంచీ భారతీరాజా కళల పట్ల ఆకర్షితుడై సినిమా రంగంలో తన ఉనికిని చాటుకోవాలని తపించేవారు. దాంతో మదరాసుకు చేరి చిత్రసీమలో చేరేందుకు పలు పాట్లు పడ్డారు. అప్పట్లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమా రంగాలన్నిటికీ కేంద్రం మదరాసు. దాంతో తొలుత కన్నడ దర్శకుడు పుట్టన్న కణగల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. తరువాత తెలుగు దర్శకులు పి.పుల్లయ్య వద్ద కొన్ని చిత్రాలకు పనిచేశారు. మళయాళ దర్శకుడు ఎమ్.కృష్ణన్ నాయర్ దగ్గర, తమిళ దర్శకుడు ఎ.జగన్నాథన్ చిత్రాలకూ అసోసియేట్ గా, కో-డైరెక్టర్ గా ఉన్నారు భారతీరాజా. నాలుగు భాషల దర్శకుల వద్ద పనిచేయడంతో భారతీరాజాకు దర్శకత్వంపై మంచి పట్టు లభించింది. తన ఊరికి సమీపంలోని వారే అయిన ఇళయరాజా, వారి సోదరులను కూడా చిత్రసీమలో అడుగు పెట్టేలా చేయడానికి భారతీరాజా ఎంతగానో సహకరించారు. ఇక భారతీరాజా తాను తీసే చిత్రం రెగ్యులర్ మూవీస్ కు భిన్నంగా ఉండాలని ఎప్పుడూ తపించేవారు. ఆ తపనతోనే పల్లెవాతావరణం నేపథ్యంలో ‘పదునారు వయదినిలే’ రూపొందించారు. ఆ చిత్రం సాధించిన ఘనవిజయంతో భారతీరాజా వైవిధ్యం కోసం సినీజనం పరుగులు తీశారు. భారతీరాజా రెండో చిత్రం ‘కిళక్కే పోగుం రైల్’ ఈ చిత్రం ద్వారా రాధికను నాయికగా పరిచయం చేశారు. ఇందులో మన తెలుగు నటుడు సుధాకర్ (తరువాత తెలుగులో ఫేమస్ కమెడియన్ గా మారారు) హీరోగా నటించారు. ఈ సినిమా మరింత విజయం సాధించింది. సుధాకర్ కు తమిళనాట స్టార్ హీరోగా మారడానికి కారణమయింది. మూడో చిత్రం ‘సిగప్పు రోజాక్కల్’. ఇది సంచలన విజయం సాధించింది. కమల్, శ్రీదేవి నటించిన ఈ చిత్రం తెలుగులో ‘ఎర్ర గులాబీలు’గా అనువాదమై, ఇక్కడా విజయం సాధించింది. నాల్గవ చిత్రంగా ’16 వయదినిలే’ను హిందీలో ‘సోల్వా సావన్’గా తెరకెక్కించారు భారతీరాజా. ఈ సినిమాతోనే శ్రీదేవి హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది. ‘సోల్వా సావన్’ అంతగా అలరించలేకపోయింది.
తరువాత భారతీరాజా తెరకెక్కించిన ‘పుదియ వార్పుగల్’లో ఆయన శిష్యుడు భాగ్యరాజ్ హీరోగా నటించగా, రతి అగ్నిహోత్రి నాయిక. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇదే కథను భారతీరాజా తెలుగులో ‘కొత్త జీవితాలు’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా ద్వారా సుహాసిని తెలుగు చిత్రసీమకు పరిచయమయింది. అప్పటికే వరుసగా సిల్వర్ జూబ్లీ హిట్స్ చూశారు భారతీరాజా. దాంతో ‘కొత్తజీవితాలు’ పోస్టర్స్ పై ‘రజతోత్సవాల చిత్ర దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన చిత్రం’ అని ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. ‘అలైగల్ ఒయివదిల్లై’ చిత్రం ద్వారా రాధను నాయికగా పరిచయం చేశారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఇదే చిత్రం తెలుగులో భారతీరాజా దర్శకత్వంలోనే ‘సీతాకోకచిలుక’గా రూపొందింది. ఈ సినిమా ద్వారా ముచ్చెర్ల అరుణ నాయికగా పరిచయమయింది. తెలుగులో కార్తిక్ కు ఇదే తొలి చిత్రం. ఇక భారతీరాజా రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘టిక్ టిక్ టిక్’ కూడా అప్పటి యువతరాన్ని ఆకట్టుకుంది. తెలుగులో “యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు” వంటి చిత్రాలు రూపొందించారు. అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కృష్ణతో ‘జమదగ్ని’, చిరంజీవితో ‘ఆరాధన’ రూపొందించారు భారతీరాజా. ఇవి కూడా ఆట్టే అలరించలేకపోయాయి. ఆ తరువాత ఆయన మళ్ళీ తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించలేదు. అయితే భారతీరాజా రూపొందించిన చిత్రాలు తెలుగులో అనువాదమై అలరిస్తూ ఉండేవి.
భారతీరాజా ‘కిళక్కే పోగుం రైల్’ను తెలుగులో బాపు దర్శకత్వంలో ‘తూర్పు వెళ్ళే రైలు’గా రూపొందించారు. శివాజీగణేశన్, రాధతో భారతీరాజా రూపొందించిన ‘ముదల్ మారియాదై’ తమిళనాట మంచి విజయం సాధించింది. తెలుగులో ‘ఆత్మబంధువు’గా అనువాదమై ఇక్కడా విజయకేతనం ఎగురవేసింది. భారతీరాజా ‘మన్ వాసనై’ చిత్రం తెలుగులో బాలకృష్ణ హీరోగా ‘మంగమ్మగారి మనవడు’గా రూపొందింది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! శిష్యుడు భాగ్యరాజ్ అందించిన ‘ఒరు ఖైదియన్ డైరీ’ స్టోరీతో భారతీరాజా తీసిన చిత్రం మంచి విజయం సాధించింది. కమల్ నటించిన ఈ చిత్రం తెలుగులో ‘ఖైదీ వేట’గా వచ్చి అలరించింది. ఇదే చిత్రాన్ని హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా భాగ్యరాజా దర్శకత్వంలో మన తెలుగు నిర్మాత ఎ.పూర్ణచంద్రరావు ‘ఆఖరీ రాస్తా’గా నిర్మించి, విజయం సాధించారు. ఇక భారతీరాజా తెరకెక్కించిన ‘కరుతమ్మ’ మంచి విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా మహేశ్వరి పరిచయమయింది. తన చిత్రాల ద్వారా ఎందరికో సినీజీవితం ప్రసాదించారు భారతీరాజా.
2013లో ఆయన తెరకెక్కించిన ‘అన్నకోడి’ అంతగా అలరించలేకపోయింది. దాంతో దాదాపు ఏడేళ్ళు మెగాఫోన్ పట్టలేదు భారతీరాజా. 2020లో ఆయన రూపొందించిన ‘మీండుమ్ ఒరు మరియాదై’ కూడా ఆకట్టుకోలేదు. ఇందులో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. అంతకు ముందు కొన్ని చిత్రాలలో అతిథిగా కనిపించిన భారతీరాజా, మణిరత్నం తెరకెక్కించిన ‘యువ’ సినిమా ద్వారా నటునిగా మారారు. తరువాత పలు చిత్రాలలో నటించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలను ధరించడానికి ఆయన ఉత్సాహంగానే ఉన్నారు. జూలై 17తో భారతీరాజాకు 79 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!