పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభ అట్టుడికిపోయింది. వ్యవసాయ సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టగా… వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని, ప్రశ్నోత్తరాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే సభలో విపక్షాల ఎంపీలు నిరసనలు తెలుపుతుండగానే సాగుచట్టాల రద్దు బిల్లును కేంద్రమంత్రి తోమర్ ప్రవేశపెట్టగా.. ఈ బిల్లుపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ వినతిని తోసిపుచ్చిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. చర్చ లేకుండానే మూజువాణి ఓటింగుతో బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.
Read Also: టీడీపీ నేతలకు వార్నింగ్.. కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల ధర్నా
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఆమోదం అనంతరం… లోక్ సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్ సభ వాయిదా పడింది. కాగా గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దానికి సంబంధించిన బిల్లును ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టింది.