ఏపీ టికెట్ల ధరల తగ్గింపు విషయం చినికిచినికి గాలివానలా తయారైంది. ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు, సినిమా థియేటర్లు మూసివేత పరిణామాలతో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం జీవో 35 ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలు అన్ని సినిమాలకు ఒకే విధంగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టి జీవో 35ను రద్దు చేస్తూ.. సినిమా టికెట్ల ధరలపై పూర్తి హక్కు నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు ఉందని తీర్పునిచ్చింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయడంతో మరోసారి టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమతి పత్రాలు లేని పలు సినిమా థియేటర్లను సీజ్ చేశారు. మరి కొన్ని చోట్ల టికెట్ ధరలు తగ్గించి థియేటర్‌ను నడపలేమని థియేటర్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లను మూసివేశాయి. ఈ క్రమంలో నేడు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్లు భేటీ కానున్నారు. సినిమా థియేటర్ల మూసివేత, టికెట్ ధరలపై ప్రభుత్వంతో ఎగ్జిబిటర్లు చర్చలు జరుపనున్నారు. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగకు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్నాయి.