NTV Telugu Site icon

Prakash Singh Badal: పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత

Parkash Singh Badal

Parkash Singh Badal

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో వారం క్రితం మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలను భటిండాలోని బాదల్ గ్రామంలో నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని మొహాలి నుంచి బాదల్ గ్రామానికి తరలించనున్నారు. ప్రకాష్ సింగ్ బాదల్ పార్థివ దేహాన్ని చండీగఢ్‌లోని సెక్టార్ 28లోని SAD ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు, అక్కడ ప్రజలు చివరి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత చండీగఢ్ నుంచి బాదల్ గ్రామం వరకు ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ప్రముఖ రాజకీయ వేత్త అంత్యక్రియలు ఏప్రిల్ 27 (గురువారం)న నిర్వహించనున్నారు. ప్రకాష్ సింగ్ బాదల్‌కు భార్య సురీందర్ కౌర్ బాదల్, కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, కోడలు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఉన్నారు. బాదల్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పంజాబ్ నాయకుడికి నివాళులర్పించారు. బాదల్ భారత రాజకీయాలలో ఒక గొప్ప వ్యక్తి, గొప్ప రాజనీతిజ్ఞుడు అని ట్వీట్ చేశారు.
Also Read:Off The Record: కేసీఆర్‌ ఊహించని నిర్ణయం..? గజ్వేల్ నుంచి పోటీ చేయట్లేదా..?

ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రకాష్ సింగ్ బాదల్ పనిచేశారు. ప్రకాష్ సింగ్ బాదల్ 1970-71, 1977-80, 2007-2017 మధ్య పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. పంజాబ్‌లో సీఎం పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా ప్రకాష్ సింగ్ బాదల్ నిలిచారు. పంజాబ్‌లోని అబుల్ ఖురానా గ్రామంలో డిసెంబర్ 8, 1927న జన్మించిన ప్రకాష్ సింగ్ బాదల్ 1950లలో అకాలీదళ్ పార్టీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పంజాబ్ శాసనసభ సభ్యునిగా (MLA) అనేకసార్లు పనిచేశారు. 1970లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
Also Read:Rain Alert: మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

ఏడు దశాబ్దాల పాటు సాగిన రాజకీయ జీవితంలో బాదల కేవలం రెండు ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారు. 1967, 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూశారు. జూన్ 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో మిలిటెంట్లను ఏరివేయడానికి సైన్యం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించినప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు. 2020లో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనపై ఆయన పార్టీ బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిరసన తెలిపిన రైతుల పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా ప్రకాష్ సింగ్ బాదల్ తన పద్మవిభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చారు. పొరుగున ఉన్న హర్యానాతో నది నీటిని పంచుకోవడానికి ఉద్దేశించిన సట్లెజ్ యమునా లింక్ (SYL) కాలువ ఆలోచనను అకాలీదళ్ నాయకుడు తీవ్రంగా వ్యతిరేకించారు.

Show comments