తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆయన తిరుగులేని విజయాన్ని సాధించారు.. మొత్తం 22 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. 20 రౌండ్‌లోనే ఈటల రాజేందర్ విజయం ఖాయమైపోయింది. ఎందుకంటే.. అప్పటికే ఈటల రాజేందర్ 21 వేలకు పైగా ఓట్ల అధిక్యంలో ఉన్నారు. ఇక లెక్కించాల్సిన ఓట్ల కంటే.. ఈటలకు లభించిన ఆధిక్యమే అధికంగా ఉండడంతో.. ఆయన విజయం ఖరారైంది. ఈటల రాజేందర్.. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించడం ఇది ఏడో సారి కావడం విశేషం. 2004 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. మూడుసార్లు ఉప ఎన్నికల్లో.. నాలుగు సాధారణ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు.