NTV Telugu Site icon

రేపే హైద‌రాబాద్‌కు ఈట‌ల‌.. రాజీనామా అప్పుడే..!

Etela Rajender

ఊహించ‌ని ప‌రిణామాల‌తో ఈట‌ల రాజేంద‌ర్ మంత్రి ప‌ద‌వి పోయింది.. దీంతో.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ వేదిక‌పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డిన టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌.. అన్ని పార్టీల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. చివ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ వైపే ఆయ‌న మొగ్గు చూపారు.. ఢిల్లీలో మ‌కాం వేసి మ‌రి.. త‌న‌కు ఉన్న అనుమానాల‌ను నివృత్తిచేసుకునే ప‌నిలో ప‌డ్డారు.. త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరారు.. మొత్తంగా బీజేపీ అధిష్టానం నుంచి ఆయ‌న‌కు సానుకూల ప‌రిస్థితులు ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.. దీంతో.. రేపు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు ఈట‌ల‌.. ఎల్లుండి అంటే జూన్ 4వ తేదీన శుక్రవారం రోజు.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

4వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు.. ఆ తర్వాత, వచ్చే వారం మ‌ళ్లీ ఢిల్లీ వెళ్ల‌నున్న ఈట‌ల రాజేంద‌ర్… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా సమక్షంలో బీజేపీలో చేర‌నున్నారు.. మొత్తంగా.. వారం రోజులుగా మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి, ఇత‌ర నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అయిన‌ట్టు చెబుతున్నారు.. ఇక‌, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత ఎదురయ్యే పరిణామాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు వ్యూహ రచన ఖరారు చేయ‌నున్నారు బీజేపీ రాష్ట్ర నేత‌లు.. రాజీనామాతో వ‌చ్చే ఉప ఎన్నికలో ఈటల రాజేంద‌ర్‌ విజయమే లక్ష్యంగా వ్యూహ‌ర‌చ‌న చేయ‌నున్నారు.. ఇవాళ అరగంటకు పైగా బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ సంతోష్ తో చర్చలు జరిపిన ఈటెల, రాష్ట్ర బిజేపి ఇంచార్జ్ తరుణ్ చుగ్, వివేక్ వేంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి.. ఈ అంశాలు అన్నీ చ‌ర్చించిన‌ట్టుగా తెలుస్తోంది.. మ‌రోవైపు.. కర్నాటక తర్వాత తెలంగాణలో బీజేపీ బలోపేతంపై ఆ పార్టీ అధిష్టానం మ‌రింత దృష్టిసారించిన‌ట్టు తెలుస్తోంది.