టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన ఆధారాలు బలంగా లేవని ఎక్సైజ్ శాఖ తెలిపింది. కెల్విన్ పై ఛార్జ్ షీట్ లో సినీ తారల విచారణ ప్రస్తావించిన ఎక్సైజ్ శాఖ.. ఈమేరకు సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని పేర్కొంది. సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చారు.
ఎక్సైజ్ శాఖ ప్రకారం.. ‘సిట్ బృందం పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. అన్ని రకాల సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి, విశ్లేషించింది. సెలబ్రిటీలపై బలమైన తగిన ఆధారాలు లభించలేదు. సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవు. సెలబ్రిటీలపై కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉన్నాయి. కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేం.. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదు. సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ కూడా లభించలేదని’ ఎక్సైజ్ శాఖ తెలిపింది.
పూరి జగన్నాథ్, తరుణ్ స్వచ్ఛందంగా బయో శాంపిల్స్ కూడా ఇచ్చారు. పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ తేల్చిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు . దీంతో నిందితులు, సాక్షుల జాబితాలో సినీ తారల పేర్లను ఎక్సైజ్ శాఖ పొందుపరచలేదు.
