NTV Telugu Site icon

కాంగ్రెస్‌కు భారీగా క్రాస్‌ ఓటింగ్‌.. టీఆర్ఎస్‌లో కలవరం..!

తెలంగాణలో ఇవాళ వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది.. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలకు గాను.. ఆరింటిని తన ఖాతాలోనే వేసుకుంది గులాబీ పార్టీ.. అయితే, కొన్ని చోట్ల క్రాస్‌ ఓటింగ్‌ అధికార పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది… ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్‌ పార్టీకి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ అభ్యర్థికి క్రాస్‌ అయ్యాయి… ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 116 ఓట్లు ఉన్నాయి.. ఇక, టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల తర్వాత కాంగ్రెస్‌లో మిగిలింది 96 మంది ప్రజాప్రతినిధులు మాత్రమే.. కానీ, ఇవాళ్టి ఫలితాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి అనూహ్యంగా 242 ఓట్లు వచ్చాయి.. దీంతో.. అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది.

Read Also: 12 బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీ..!

కాగా, ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మ‌ధు విజయం సాధించిన సంగత తెలిసిందే.. టీఆర్ఎస్ అభ్యర్థికి 480 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 242 ఓట్లు వ‌చ్చాయి. తన సమీప ప్రత్యర్థిపై అధికార పార్టీ అభ్యర్థి తాతా మ‌ధు 238 ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు.. ఇక, చెల్లని ఓట్లు 12 ఉంటే.. స్వతంత్ర అభ్యర్థికి కేవలం 4 ఓట్లు మాత్రమే వచ్చాయి.. అయితే, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరగడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. దాదాపు 140 ఓట్లు కాంగ్రెస్‌కు క్రాస్‌ అయ్యాయి.. ఈ ఎన్నికల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యూహం పనిచేసిందని చెబుతున్నాయి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు.. ఇక, ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్న అధికార పార్టీ నుంచి విజయం సాధించిన తాతా మధు.. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెబుతున్నారు.