Site icon NTV Telugu

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీలోకి కరోనా వైద్యం..!

కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో ఎక్కువగా ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి ఎక్కువగా వినిపించిన మాట.. కోవిడ్‌ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని.. ఇక, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ను తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ రాగా.. ఇప్పటికే ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేస్తోన్న ప్రభుత్వం.. ఇప్పుడు కోవిడ్‌ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్‌ భారత్‌ పేరిట ఈ పథకం అమలు చేయనున్నారు.. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద 1,026 చికిత్సలు అమలులో ఉండగా.. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌.. రెండింటిలో కలసిన చికిత్సలు 810 ఉన్నాయి.. మరో 216 ఆరోగ్యశ్రీ చికిత్సలు ఆయుష్మాన్‌ భారత్‌లో లేకపోయినా.. వాటిని గతంలో మాదిరిగానే కొనసాగించనున్నారు.

ఇక, కరోనాకు అందించే చికిత్సలను మొత్తంగా 17 రకాలుగా విభజించారు అధికారులు.. అక్యూట్‌ ఫెబ్రైల్‌ ఇల్‌నెస్‌, పైరెక్సియా ఆఫ్‌ అన్‌నోన్‌ ఆరిజిన్‌, నిమోనియా ఉన్నాయి. వీటితోపాటు మిగిలిన 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలోనే వైద్యం అందనుండా.. దశలవారీగా ప్రైవేట్ ఆస్పత్రలకు విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ రాకతో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల సంఖ్య 1,668కి పెరిగింది. అయితే వీటిలో 642 చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వ వైద్యంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం 50 బెడ్స్‌ ఉన్న ఆస్పత్రులకు మాత్రమే అనుమతి ఉండగా.. ఆయుష్మాన్‌ భారత్‌ చేరికతో ఇకనుంచి 6 బెడ్స్‌ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో.. 30 బెడ్స్‌ ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 6 బెడ్స్‌ ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేయడానికి అవసరమైన గైడ్‌లైన్స్‌ను రూపొందించిన తర్వాత.. దీనిపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు.

Exit mobile version