Site icon NTV Telugu

బీజేపీ దూకుడుకి బ్రేక్ పడిందా? ఆ ఎఫెక్టే కారణమా?

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, అమిత్ షా సభలు ఇప్పట్లో లేనట్టేనా? మంచి దూకుడు మీదున్న బీజేపీ స్పీడ్‌ కు ఆటంకాలు వచ్చాయా? ఒమిక్రాన్ ఎఫెక్ట్ కారణంగానే బీజేపీ యాత్రలు వాయిదా పడ్డాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డిసెంబర్ 15 తరవాత ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని గతంలో ప్రకటించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.

అయితే, ఇప్పటి వరకూ యాత్ర షెడ్యూల్ ఖరారు కాలేదు. ఒకవైపు ఒమిక్రాన్ కేసులు.. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇప్పట్లో యాత్ర ఉండక పోవచ్చు అంటున్నారు బీజేపీ నేతలు. నిరుద్యోగ దీక్షకు అనుమతి ఇవ్వలేదు. ఇటు బీజేపీ సంగ్రామ యాత్రకు అనుమతి సందేహమే అంటున్నారు కమలనాథులు. కేంద్ర ప్రభుత్వం కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ జాగ్రత్తలు జారీ చేస్తుంది. దీంతో ఒమిక్రాన్ పై క్లారిటీ వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు సడలించే వరకు పాదయాత్ర షెడ్యూల్ ఖరారు ఉండక పోవచ్చు అన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

అలాగే తెలంగాణలో త్వరలో పర్యటిస్తానని, సభల్లో పాల్గొంటానని బీజేపీ బాద్ షా అమిత్ షా తెలంగాణ నేతల ఢిల్లీ టూర్ లో ప్రకటించారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో అమిత్ షా సభ కూడా ఇప్పట్లో ఉండక పోవచ్చు అంటున్నారు. రెండు రోజుల సమయం ఇస్తానని.. డేట్స్ చెబుతా నని షా రాష్ట్ర నేతలకు చెప్పిన అమిత్ షా అందుకే మిన్నకుండి పోయారంటున్నారు. ఒమిక్రాన్, కోవిడ్ పై స్పష్టత వస్తేనే ఆయన పర్యటన ఉంటుందని బీజేపీ కీలక నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 28 నుండి అక్టోబర్ 2 వరకు మొదటి విడత సంగ్రామ యాత్ర చేశారు బండి సంజయ్. త్వరలో సంగ్రామ యాత్ర ప్రారంభిస్తానన్నారు. కానీ ఆ పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు.

Exit mobile version